GBS Virus | ఏపీలో కలకలం రేపుతున్న జీబీఎస్ … భయాందోళనలో జనం
అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
గుంటూరు జీజీహెచ్‌లో చికిత్సకు ఏర్పాట్లు
వైరస్‌పై అవగాహన కల్పిస్తున్న డాక్టర్లు
ఆందోళన అవసరం లేదన్న వైద్య నిపుణులు
వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తక్షణ స్పందన
జీజీహెచ్‌లో రోగులకు పరామర్శ
మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం
ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ :
గుంటూరు జిల్లాలో గిలియన్ బార్ సిండ్రోమ్ (జీబీఎస్) కలకలం రేపుతోంది. జిల్లావ్యాప్తంగా ఏడుగురికి వ్యాధి సోకినట్టు సమాచారం. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరో ఐదుగురు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోనసీమ జిల్లా, ప్రకాశం, నరసరావుపేట జిల్లాలకు చెందిన కొంతమంది అదే లక్షణాలతో గుంటూరు ఆసుపత్రికి వచ్చారు. వీరికి కూడా డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని పూణే పరిసర ప్రాంతాల్లో ఈ వైరస్ భయకంపితులను చేసింది. ఇది కొత్త జబ్బేమీ కాకపోయినా, అరుదైనదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంలో వేల మందిలో ఒకరిద్దరికి సోకే ఈ వ్యాధి ఇప్పుడు కొద్ది రోజుల్లోనే ఉన్నట్టుండి పెద్ద ఎత్తున విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ఒక వారంలోనే దేశవ్యాప్తంగా వందమందికి పైగా ఈ వ్యాధి బారిన పడగా, కొందరికి వెంటిలేటర్ సాయంతో అత్యవసర చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
చిన్న పిల్లలకు అటాక్..
మామూలుగా పెద్ద వయసు వారికే పరిమితమయ్యే ఈ వైరస్ ప్రస్తుతం పిల్లలు, శిశువుల మీద దాడి చేస్తుండటం, రోజురోజుకీ కేసులు సంఖ్య పెరుగుతుండడం, ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుండడం, మరింత కలవరానికి కారణమవుతోంది. ఇప్పటికే ఏపీ వైద్యఆరోగ్య శాఖ దృష్టి సారించింది. అయితే.. ఇది నేరుగా ఒకరి నుంచి మరొకరికి సోకేది కాకపోయినప్పటికీ, కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతా జాగ్రత్తగా ఉండడం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జీజీహెచ్‌లో ప్రస్తుతం నాగవేణి, రమీజాన్ బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఎవరూ భయపడొద్దు..
జీబీస్ వైరస్పై ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు స్పందించారు. గుంటూరు జీజీ హెచ్ లో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలను సూపరిండెండెంట్ రమణ ఎస్ఎస్వీని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జీజీహెచ్ లో నాలుగు రోజుల్లో ఏడు కేసులు నమోదయ్యాయని వారిలో ఇద్దరు డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారన్నారు. ఈ వైరస్పై ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. కాళ్లు చేతులు సచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు. దీనికి సంబంధించి వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయన్నారు. బోధన ఆసుపత్రుల్లో తగిన మందులు ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
ఆందోళన వ్దదు.. కరోనా లక్షణాలే..
గతంలో వైరస్ జబ్బుల బారిన పడిన వారికి ఈ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని జీజీ హెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి తెలిపారు. కరోనా భారిన పడిన వారిలో ఇప్పుడు ఈ వైరస్ కనిపిస్తోందన్నారు. జీజీహెచ్ న్యూరాలజీ విభాగంలో బాధితులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఇలాంటి కేసులు తరచుగా వస్తుంటాయన్నారు. ఇప్పుడు వేరే జిల్లాల నుంచి కేసులు రావడంతో సంఖ్య పెరిగినట్లు కనిపిస్తోందన్నారు. జీజీహెచ్ లో చేరిన ఎనిమిదేండ్ల పాప ఈ సిండ్రోం నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. జీజీహెచ్ లో చేరిన వారిలో కోనసీమ, పల్నాడు జిల్లా వాసులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ వైరస్ సోకిన వారికి సాధారణంగా పాదాలు, కాళ్లలో జలదరింపు, బలహీనతతో మొదలై చేతులు చాతి, మెడ, ముఖం వంటి భాగాలకు విస్తరిస్తుందని తెలిపారు. అందుకే దీన్ని అపెండింగ్ పెరాలసిస్ అని కూడా అంటారని వివరించారు. సమస్య ముదురుతున్న కొద్ది కండరాల బలహీనత, పక్షవాతం గాను మారుతుందని చెప్పారు. చాలా వరకు కదలికలకు తోడ్పడే చలన నాడుల మీద ప్రభావం చూపినా, కొందరిలో గుండె శ్వాస వేగం వంటి పనులను నియంత్రించే స్వయంచాలిత నాడీ వ్యవస్థను దెబ్బతీయొచ్చని యశస్వి వివరించారు. ప్రభావితమైన అవయవాలను బట్టి వేరువేరు లక్షణాలు కనిపిస్తుంటాయని ఆయన వెల్లడించారు.
వ్యాధి లక్షణాలివే..
వేళ్లు,, మణికట్టు లేదా మడమల వద్ద సూదులు పొడుస్తున్నట్లు అనిపించడం. కాళ్ల నొప్పులు, ఇంకా కాళ్లలో మొదలైన బలహీనత పైకి వ్యాపించడం. సరిగ్గా నడవలేకపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, నడుస్తున్నప్పుడు తూలడం, మాట్లాడడం, నవలడం, మింగడంలో ఇబ్బందులు. నోరు వంకర పోవడం, ఒకటి రెండుగా దృశ్యాలు కనిపించడం, కళ్లను కదిలించ లేకపోవడం, శ్వాస తీసుకుపోవడానికి తోడ్పడే కండరాల బలహీనంగా మారడం. ఈ దశలో వెంటిలేటర్ అమర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. గుండె వేగం అస్తవ్యస్తం, రక్తపోటులో హెచ్చుతగ్గులు, ఇలాంటివి గలవారికి ఫేస్ మేకర్ అమర్చాలి. అరుదుగా కొందరికి విపరీతమైన చెమటలు పట్టొచ్చు గులియన్ భారీలో ఇదో ప్రత్యేక లక్షణం . ఆయా లక్షణాలను బట్టి వైరస్ ను అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాళ్లు చేతుల్లో బలహీనత కనిపించినప్పుడు కొద్ది వారాల ముందు విరేచనాలు, కడుపునొప్పి వంటి వాటిని బారిన పడ్డారని చూడడం ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ సమస్యను అనుమానిస్తే కొన్ని పరీక్షలతో నిర్ధారిస్తారని వివరించారు.