gascylinder|వంటింట్లోకి కిరోసిన్?

gascylinder|వంటింట్లోకి కిరోసిన్?
మళ్లీ పాత రోజులొస్తున్నాయా?
వేధిస్తున్న గ్యాస్ కొరత
సిలిండర్ల కోసం బారులు
ప్రత్యామ్నాయంగా కిరోసిన పంపిణీకి కేంద్రం నిర్ణయం
వంట గ్యాస్ సమస్య తగ్గించేందుకు సరఫరా
కిచెన్‌లోకి కిరోసిన్ స్టవ్, దీపాలు?
ఆనాటి రోజులు వస్తున్నాయా అనే చర్చ
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రస్తుత పరిస్థితులు చూస్తే మళ్లీ కొన్ని దశాబ్దాల క్రితం జీవనం మళ్లీ అలవాటు చేసుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఒకప్పుడు ఇంట్లో కిరోసిన్ దీపాలు, స్టవ్‌లు ఉండేవి. కరెంటు లేనివారు రాత్రివేళ కిరోసిన్ దీపాలు పెట్టుకొని వంట వార్పు, భోజనం చేసేవారు. అలాగే కొందరు కిరోసిన్ స్టవ్‌ల మీద వంట చేసుకునేవారు. గ్యాస్ స్టవ్‌లు వచ్చిన తర్వాత అవన్నీ మూలకు పడ్డాయి. ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా అవన్నీ మళ్లీ వాడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. గ్యాస్ సిలిండర్లు దొరకని పరిస్థితుల్లో మళ్లీ కిరోసిన్ ద్వారా వంట చేసుకోవాలేమో అని సామాన్యులు చర్చించుకుంటున్నారు. పరిశ్రమలు కూడా కిరోసిన్ స్టవ్‌ల తయారీని మొదలు పెట్టాలేమో..?

పశ్చిమాసియా యుద్ధం మంటలు భారత్‌లోని ప్రతీ ఇంటి వంట గదిలోనూ మండుతున్నాయి. గ్యాస్‌తోపాటు పెట్రోల్ ఇతర నిత్యావసరాలపై ఈ ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా గ్యాస్, పెట్రోల్ కొరత సామాన్యులను పట్టి పీడిస్తోంది. గ్యాస్ కోసం గోదాంల వద్ద బారులు దీరుతున్నారు. పెట్రోల్ కోసం బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ వంటకు అలవాటుపడిన వారు బండ కోసం గాబర పడుతున్నారు. బుకింగ్ చేసినా ఇంటికి సిలిండర్ రాక ఇబ్బందులు పడుతున్నారు. పనులు మానుకొని సిలిండర్ కోసం పరుగులు పెడుతున్నారు. ప్రజల అవస్థలను గుర్తించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

హర్మూజ్ జలసంధిలో చమురు రవాణాకు అంతరాయం ఏర్పడటంతో గ్యాస్, ఇంధనాల కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది. వంట గ్యాస్ సమస్యను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. ఇందుకోసం ప్రజలకు సుపీరియర్ కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. రేషన్ దుకాణాల ద్వారా దీనిని అందించాలని చమురు మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేవలం వంట, దీపాలు వెలిగించడం కోసమే షరతులకు లోబడి ఈ పంపిణీని చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో పాటు లైసెన్స్ పొందిన సర్వీస్ స్టేషన్‌లలో 2,500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని కేంద్రం తెలిపింది.

సుపీరియర్ కిరోసిన్ అంటే ..?
ఇక, సుపీరియర్ కిరోసిన్ అయిల్ అనేది ముడిచమురు రిఫైనరీ ప్రక్రియ నుంచి వచ్చే ఉప ఉత్పత్తి. ఇది అత్యంత శుద్ధి చేసిన కిరోసిన్ ఆయిల్. దీన్ని ప్రధానంగా వంటకు, దీపాలు వెలిగించేందుకు ఉపయోగిస్తారు. సాధారణ లో-గ్రేడ్ కిరోసిన్‌తో పోలిస్తే ఇందులోనుంచి వెలువడే వాయువులు చాలా తక్కువ. అంతేకాదు, దీని వెలిగించినప్పుడు వచ్చే పొగ కూడా తక్కువ.

