విదేశీ జట్టు హెడ్ కోచ్ గా సౌరవ్ గంగూలీ
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. ఆయన ఇప్పుడు ఓ విదేశీ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. దక్షిణాఫ్రికాలో జరిగే SA20 లీగ్‌లో ఆడే ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుకు గంగూలీని కోచ్‌గా నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఇది గంగూలీ కోచింగ్ కెరీర్‌లో తొలి అనుభవం. ఇప్పటివరకు ఆయన IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్‌గా మాత్రమే పనిచేశారు.
గంగూలీకి ఆటగాడిగా ఉన్న అనుభవం, కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించిన తీరు, అలాగే బీసీసీఐ అధ్యక్షుడిగా క్రికెట్ అభివృద్ధికి చేసిన కృషి అపారమైనది. ఈ నేపథ్యం ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నియామకంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తరువాత, గంగూలీ మళ్లీ క్రికెట్ మైదానంలో కొత్త పాత్రలో కనిపించబోతుండటం చాలా మందికి సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రిటోరియా క్యాపిటల్స్‌కు గంగూలీ కోచింగ్ ఎలా ఉంటుంది, జట్టు ఎంతవరకు విజయాలు సాధిస్తుందనేది చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, గంగూలీ లాంటి అనుభవజ్ఞుడు కోచ్‌గా ఉంటే, జట్టు కొత్త దిశలో అడుగులు వేయడం ఖాయం.