తెర వెనుక నుంచి తెర‌మీద‌కు..

  • ‘మిరాయ్’తో ఫుల్ సక్సెస్ !
  • ఆంధ్ర‌ప్ర‌భ ఎంట‌ర్టైన్మెంట్ ప్రత్యేక ఇంటర్వ్యూ…

ఈ నెల‌ సెప్టెంబర్ 5న విడుదలైన ‘మిరాయ్’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ, వసూళ్ల వర్షం కురిపించిన ఈ సెన్సేషనల్ మూవీలో.. హీరో తేజ సజ్జాతో పాటు ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించింది మరొక యువ నటుడు మ్యాడీ మానేపల్లి.

సినిమా మొత్తం హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కీలకంగా కనిపించి, మెప్పించిన మ్యాడీతో ఆంధ్ర‌ప్ర‌భ ఎంట‌ర్టైన్మెంట్ ప్రత్యేకంగా ముచ్చటించింది.

గుంటూరుకు చెందిన మ్యాడీకి సినీప్రస్థానం చిన్నప్పుడే మొదలైంది. మొదట చైల్డ్ ఆర్టిస్ట్‌గా, తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. తండ్రి కూడా నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కావడంతో సినిమా రంగంలోకి రావడం సులభమైనట్లే అనిపించినా, వాస్తవంలో మ్యాడీకి ప్రయాణం అంత తేలిక కాలేదు. అవకాశాల కోసం చాలా కష్టపడి, ఎన్నో నిరాశలు ఎదుర్కొన్నాడు.

తనకున్న ఆసక్తి కారణంగా టెక్నికల్ విభాగాల్లో కూడా నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఎడిటింగ్‌పై ప్రత్యేకమైన మక్కువ పెంచుకుని, టెక్నీషియన్‌గా కూడా ప్రయాణం మొదలు పెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా’ వంటి సినిమాకు టెక్నీషియన్‌గా పనిచేసిన అనుభవం ఆయనకుంది. వందకు పైగా సినిమాల్లో ఎడిటర్స్‌ వద్ద పనిచేశారు. 2007లో ‘ది జఫ్పా’ అనే షార్ట్ ఫిలిం కూడా తీశారు.

అవకాశాల కోసం..

నటనపై మక్కువతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే తపనతో అవకాశాల కోసం ప్రతి రంగంలోనూ ప్రయత్నించారు మ్యాడీ. యాంకరింగ్, ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అయితే, అన్ని పనులూ చేస్తూ ఉంటే నటుడిగా అవకాశం రావడం కష్టమని గ్రహించి, పూర్తిగా ఆడిషన్స్‌పై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే 2010లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా దర్శకుడు కార్తీక్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది.

తెర వెనుక టెక్నీషియన్‌గా అన్ని విద్యలూ నేర్చుకున్నా.. ఆడియన్స్‌ ముందు తెరమీదకు రావడానికి మ్యాడీకి ఏకంగా 20 ఏళ్లు పట్టింది. నేడు ‘మిరాయ్’ సక్సెస్‌తో తన సుదీర్ఘ ప్రయాణానికి సరైన గుర్తింపు లభించింది…

మ్యాడీ తో మిరాయ్ సినిమా విశేషాలు.. క్రింద వీడియో చూడండి..

Leave a Reply