ఉచిత లడ్డు ప్రసాద పంపిణీ..

- కనకదుర్గమ్మ భక్తులకు దేవస్థానం కానుక…
- భవాని దీక్షల విరమణ సందర్భంగా ఐదు లక్షల లడ్డూలు మిగులు..
- సాధారణ విక్రయాలతో పాటు, ఉచితంగా భక్తులకు..
- మిగిలిన లడ్డులు ఉచిత ప్రసాదంగా భక్తులకు…
- సాధారణ ప్రసాదం దద్దోజనం, కట్ట పొంగలి, పులిహార స్థానంలో పంపిణీ…
- భక్తులకు పంపిణీ చేసిన ఈవో, చైర్మన్,ట్రస్ట్ సభ్యులు..
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా భక్తులకు పంపిణీ చేశారు. ఈనెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించిన భవానీ దీక్షలు విరమణ సందర్భంగా పెద్ద ఎత్తున తయారుచేసిన లడ్డూలు మిగిలిన నేపథ్యంలో వాటిని భక్తులకు ఉచితంగా అందించేందుకు నిర్ణయించిన చైర్మన్ బొర్రాగాంధీ, ఈఓ శీనా నాయక్ ఆదేశాలతో పంపిణీని అధికారులు ప్రారంభించారు.
మిగిలిన 4.62 లక్షల లడ్డులు..
దసరా ఉత్సవాలతో పాటు భవాని దీక్షల విరమణ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునే భక్తులు పెద్ద ఎత్తున లడ్డు ప్రసాదాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది భవానీ దీక్షల విరమణ సందర్భంగా గరిష్ట స్థాయిలో భవానీలు వచ్చే అవకాశం ఉందన్న ముందస్తు ఆలోచన నేపథ్యంలో ఆలయ అధికారులు మూడు ప్రసాద తయారీ పాయింట్ల వద్ద 32.43 లక్షల లడ్డూలు తయారు చేసేందుకు ముందుగా నిర్ణయించారు. అయితే పరిస్థితి ముందే ఊహించి తయారీని కాస్త తగ్గించి 28 లక్షల లడ్డూలు తయారు చేశారు. 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఆరు రోజుల్లో 22.70 లక్షల లడ్డూలు మాత్రమే విక్రయాలు జరగగా 4,61,956 లడ్డూలు నిల్వ ఉన్నాయి. 17వ తేదీ నుండి విక్రయాలు మళ్లీ ప్రారంభించినప్పటికీ ప్రతిరోజు 50 వేల లడ్డూలు మాత్రమే విక్రయాలు జరగడం రద్దీ తక్కువగా ఉన్న నేపథ్యంలో మిగిలిన లడ్డూలు త్వరగా పంచే క్రమంలో భక్తులకు ఉచితంగా అందించేందుకు నిర్ణయించారు.
ఉచిత ప్రసాద స్థానంలో లడ్డు..
నిత్యం కనకదుర్గమ్మ వారిని దర్శించుకునే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిరోజు దద్దోజనం కట్ట పొంగలి పులిహోర బెల్లం పొంగలి శనగలు ఇలా ఏదో ఒకటి ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. ఇంద్రకీలాద్రిపై ఏర్పాటుచేసిన పలు ప్రాంతాలలో వీటిని అమ్మవారి ప్రసాదంగా భక్తులకు అందిస్తుంటారు. అయితే ఇటీవల లడ్డూలు నిల్వ ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో ఉచిత ప్రసాదాల పంపిణీలో భాగంగా ఈనెల 18వ తేదీ నుండి లడ్డూలను భక్తులకు ఉచితంగా అందజేస్తున్నారు. ఉచిత లడ్డులను ఈవో శీనా నాయక్, చైర్మన్ బొర్రా గాంధీతో పాటు పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు వెలగపూడి శంకర్ బాబు శుక్రవారం పెద్ద ఎత్తున లడ్డూలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు.
