Mahbubabad | గురుకుల పాఠశాలలో నలుగురు విద్యార్థులకు అస్వస్థత…
మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలోని సాంఘీక సంక్షేమ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో గమనించిన గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విద్యార్థులకు చికిత్స అందించారు.
విద్యార్థులు గురువారం సాయంత్రం స్నాక్స్ సమయంలో గుడాలు తీసుకొని రాత్రి భోజనం చేసిన తరువాత నిద్రపోయామని తెల్లవారు జామున కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు అవుతున్నాయని విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలుపగా.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గురుకుల పాఠశాలలో రీజనల్ కోఆర్డినేటర్ హరి సింగ్ పర్యవేక్షణ లోపం వల్లనే ఇలా జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.