నలుగురు సర్పంచ్ లు.. 72 వార్డ్ మెంబర్ లు ఏకగ్రీవం !!

- 23 గ్రామాలలో 98 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో
- 172 వార్డ్ స్థానాలకు జరిగే ఎన్నికలకు 447 మంది బరిలో నిలిచారు
భీమ్‌గల్ రూరల్, (ఆంధ్రప్రభ) : భీమ్‌గల్ మండలంలో మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సరికి, 27 సర్పంచ్ స్థానాల్లో 4 చోట్ల ఏకగ్రీవాలు నమోదయ్యాయి. మిగతా 23 సర్పంచ్ స్థానాలకు జరిగే ఎన్నికల్లో 98 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మొత్తం 244 వార్డ్ సభ్యుల స్థానాల్లో, 72 స్థానాలు ఏకగ్రీవం కాగా, 172 వార్డుల కోసం తుది జాబితా ప్రకారం 447 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, రాహత్ నగర్‌లో బాదావత్ తిరుపతి, కారేపల్లిలో బాదావత్ మోతీలాల్, సంతోష్ నగర్ తాండాలో పాల్య అన్వేష, సుదర్శన్ నగర్ తాండాలో భూక్య వంసుధర్ నాయక్‌లు సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇందులో రాహత్ నగర్ గ్రామం పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్వగ్రామం కావడం విశేషం.
అధిక పోటీ గల గ్రామాలు
మండలంలో అత్యధికంగా గోన్ గోప్పుల గ్రామంలో 7 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. లింగాపూర్, పిప్రి, దేవక్కపేట్, చేంగల్, బెజ్జోరా గ్రామాల్లో 6 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు.
బాబానగర్, కొత్తతాండా, ముచ్కూర్, పురాణీపేట్ గ్రామాల్లో 5 మంది చొప్పున, బాచన్ పల్లి, దేవన్ పల్లి, పల్లికొండ, రూప్లాతాండా, సికింద్రాపూర్ గ్రామాల్లో 4 మంది చొప్పున అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
బడా భీమ్‌గల్, జాగిర్యాల్, కుప్పల్, మెండోరా, బాబాపూర్ గ్రామాల్లో 3 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉండగా, మూడు గుడిసెల తాండా, పెద్దమ్మకాడి తాండా, తాళ్లపల్లి తాండాలలో మాత్రమే ఇద్దరేసి అభ్యర్థులు బరిలో నిలిచి నేరుగా పోటీపడుతున్నారు.
