పెళ్లి వేడుకలో విషాదం.

పెళ్లి వేడుకలో విషాదం.
. తుంగభద్రలో ఈతకు వెళ్లి నలుగురు మృతి.
. ఆనందం మధ్య దుర్ఘటన…
.శ్రీరామనవమి రోజున కుటుంబాల్లో కన్నీటి వర్షం.
కర్నూలు బ్యూరో,ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన నలుగురు మునిగి మృతి చెందడం కలకలం రేపింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర శోకం నెలకొంది. జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని కోసిగి మండలం అగసనూరు గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం, కర్ణాటక రాష్ట్రంలోని కురుడి గ్రామానికి చెందిన 15 మంది బంధువుల ఇంట్లో పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు కందుకూరుకు వచ్చారు. ఈ క్రమంలో వారిలో నలుగురు సరదాగా తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లగా, ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరిలో దాసరి రత్నమ్మ, దాసరి ఉమాపతి అలియా సంగీత, శివానంద, మహన్తేష్ లు మృతి చెందిన వారిలో ఉండటం గమనార్హం. మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారే కావడం కుటుంబాలను మరింత దుఃఖంలో ముంచింది.
పండుగ రోజు విషాదం
ఒకవైపు బంధువుల ఇంట్లో పెళ్లి సంబరాలు జరుగుతుండగా, మరోవైపు శ్రీరామనవమి రోజున ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా విషాద వాతావరణాన్ని సృష్టించింది. ఆనందకర వేడుక క్షణాల్లోనే కన్నీటి ఘడియగా మారింది. ప్రమాదానికి కారణాలపై అనుమానాల ప్రాథమికంగా నది ప్రవాహం తీవ్రంగా ఉండడం, లోతు అంచనా వేయకపోవడం, ఈతలో అనుభవం లేకపోవడం వంటి కారణాలు ఈ ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని భావిస్తున్నారు. వేసవి కాలంలో నదుల్లో నీటి మట్టం మారుతూ ఉండటంతో ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో నదులు, చెరువుల్లో ఈతకు వెళ్లి ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. నిపుణుల సూచనల ప్రకారం తెలియని ప్రదేశాల్లో ఈతకు వెళ్లకూడదులోతు, ప్రవాహం గురించి ముందుగా తెలుసుకోవాలి పెద్దల పర్యవేక్షణలో మాత్రమే నీటిలోకి దిగాలి. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన మరోసారి నీటి మాధ్యమాల్లో జాగ్రత్తల అవసరాన్ని గుర్తు చేసింది. ఆనందంగా ప్రారంభమైన పెళ్లి వేడుక, ఒక్కసారిగా విషాదంలో ముగియడం అందరినీ కలచివేసింది. మృతుల కుటుంబాలకు స్థానికులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
