Four Days Tour | భార‌త్ లో అడుగుపెట్టిన అమెరికా ఉపాధ్య‌క్షుడు వాన్స్..

కుటుంబంతో కలిసి నాలుగు రోజులు అధికారిక పర్యటన
కాసేపట్లో ప్రధాని మోదీతో వాన్స్ వాణిజ్య చర్చలు
అక్షరధామ్ ఆలయ సందర్శన
రాజస్థాన్ సీఎం, గవర్నర్‌తోనూ భేటీ కానున్న వాన్స్

న్యూ ఢిల్లీ – అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా భారత పర్యటనకు వచ్చేశారు. సోమవారం ఉదయం వారి విమానం ఢిల్లీలోని పాలం టెక్నికల్ ఏరియాలో ల్యాండ్ అయింది. భార్య‌, ముగ్గురు పిల్ల‌ల‌తో వ‌చ్చ‌న వాన్స్ కు విమానాశ్ర‌యంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ స్వాగ‌తం ప‌లికారు.. అనంత‌రం త్రివిధ ద‌ళాలు స‌మ‌ర్పించిన గౌర‌వ వంద‌నాన్ని వాన్స్ స్పీక‌రించారు.

జేడీ వాన్స్ నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటిస్తారు. వాన్స్ సతీమణి ఉషా వాన్స్ భారత సంతతికి చెందిన మహిళ అనే విషయం తెలిసిందే. వాన్స్ తో పాటు అమెరికా ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా ఢిల్లీకి విచ్చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్‌కు ఇదే తొలి భారత పర్యటన.

ఈ పర్యటనలో భాగంగా జేడీ వాన్స్ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసే అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ చర్చల్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా పాల్గొంటారని సమాచారం. ఇరు దేశాల మధ్య సంబంధాల పురోగతిని, గత ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటన అమలును సమీక్షించేందుకు ఈ పర్యటన వీలు కల్పిస్తుందని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

అనంతరం వాన్స్ తన కుటుంబంతో కలిసి జైపూర్, ఆగ్రాలను సందర్శిస్తారు. మంగళవారం జైపూర్‌లోని ప్రసిద్ధ అమెర్ ప్యాలెస్‌ను, బుధవారం ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. అలాగే, జైపూర్‌లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో మంగళవారం జరిగే యూఎస్-ఇండియా బిజినెస్ సమ్మిట్‌లో జేడీ వాన్స్ కీలక ప్రసంగం చేస్తారు. ఈ సదస్సులో ఇరు దేశాల ఉన్నతాధికారులు పాల్గొంటారు. వాన్స్ తన ప్రసంగంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. ఏప్రిల్ 22న రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, గవర్నర్ హరిభావు బగాడేలతో కూడా ఆయన సమావేశం కానున్నారు. తన నాలుగు రోజుల పర్యటన ముగించుకుని గురువారం వాన్స్ వాషింగ్టన్‌కు తిరుగు పయనమవుతారు.

Leave a Reply