సగర కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన

సగర కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన
శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాద్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం, ఆంధ్రప్రభ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సగర సామాజిక వర్గ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. 31వ డివిజన్ పసుపు తోట వాటర్ ట్యాంక్ ఎదురు ప్రాంతంలో రూ. 75 లక్షల ఎంపీ నిధులతో నిర్మించనున్న ‘శ్రీశ్రీశ్రీ భగీరథ మహర్షి సగర కళ్యాణ మండపం’ నిర్మాణ పనులకు బుధవారం సాయంత్రం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఘనంగా శంకుస్థాపన చేశారు.
2024 ఎన్నికల పాదయాత్ర సమయంలో సగర కులస్థులు తమ సామాజిక అవసరాల కోసం ఒక కళ్యాణ మండపం కావాలని కోరగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మిస్తానని ఎంపీ శివనాథ్ తో కలిసి ఎమ్మెల్యే బొండా ఉమా హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, నిధులు మంజూరు చేయించి నేడు ఎంపీ కేశినేని చిన్నితో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించారు.

శాస్త్రోక్తంగా కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే లు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించే గుణం ఎమ్మెల్యే బొండా ఉమాలో ఉందని కొనియాడారు. ప్రజల కోరికలను నెరవేర్చడమే తమ ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బలహీన వర్గాలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించడం సంతోషంగా ఉందని, ఈ భవనం భవిష్యత్తులో శుభకార్యాలకు, సామాజిక కార్యక్రమాలకు వేదికగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ కాకొల్లు మహేంద్ర నాథ్, ప్రధాన కార్యదర్శి దాట్ల రాజేష్, దేవరపు మాల్యాద్రి, గోవింద్, బుజ్జి, ఇతర నాయకులు మరియు సగర సమాజం ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
