Foreign Tour | బ్రిట‌న్, మాల్దీవుల‌లో ప్ర‌ధాని టూర్‌ – షెడ్యూల్ విడుదల

వాణిజ్య‌, ద్వైపాక్షిక ఒప్పందాలు
మాలే జాతీయ దినోత్స‌వ వేడుకల్లో చీఫ్ గెస్ట్‌గా హాజ‌రు

న్యూఢిల్లీ , ఆంధ్ర‌ప్ర‌భ :
ప్రధాని మోదీ రెండు విదేశీ పర్యటనలకు వెళ్ల‌నున్నారు. ఈ నెల 23-26 తేదీల్లో యూకే, మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఇటీవలే ప్రధాని ఐదు దేశాల పర్యటనకు వెళ్లొచ్చారు. కొద్ది రోజుల గ్యాప్‌లనే మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. 23, 24 తేదీల్లో మోదీ యునైటెడ్ కింగ్‌డమ్‌లో పర్యటించనున్నారు. అక్కడ భారతదేశం-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులపై ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా భారతదేశానికి విస్కీ, కార్ల వంటి బ్రిటిష్ ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి.

25న మాల్దీవుల‌కు..

25-26 తేదీల్లో ప్రధాని మాల్దీవుల్లో పర్యటించనున్నారు. గతేడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రధానిపై మాల్దీవుల మంత్రులు నోరుపారేసుకున్నారు. దీంతో భారతీయ టూరిస్టులు.. మాల్దీవులు వెళ్లేందుకు నిరాకరించారు. ఈ నష్టాన్ని గుర్తించిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు దిగొచ్చారు. గతేడాది ఢిల్లీలో జరిగిన మోదీ ప్రమాణస్వీకారానికి మాల్దీవుల అధ్యక్షుడు హాజరయ్యాడు. మొత్తానికి రాజకీయ ఉద్రిక్తతల తర్వాత భార‌త ప్ర‌ధాని మాల్దీవుల్లో పర్యటించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా మొహమ్మద్ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడు అయ్యాక మోదీ పర్యటించడం కూడా ఇదే ప్రథమం.

జాతీయ దినోత్స‌వ వేడుక‌ల్లో చీఫ్ గెస్ట్‌గా ..

మాల్దీవుల 60వ జాతీయ దినోత్సవ వేడుకలకు భార‌త ప్ర‌ధాని ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2019లో మోదీ మాల్దీవులకు వెళ్లారు. రాజకీయ ఉద్రిక్తతల తర్వాత ఇన్నాళ్లకు మాల్దీవులకు వెళ్తున్నారు. ఈ పర్యటనలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి.

Leave a Reply