అన్ని వర్గాలకూ.. అగ్రతాంబూలం !!

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి పట్టణ టీడీపీ అధ్యక్ష పదవి ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. నేడో, రేపో నూతన అధ్యక్షుడి పేరును ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మైలవరం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సామాజిక న్యాయం పాటించి అందరికీ అగ్రతాంబూలం అందించారు. కొండపల్లి పట్టణ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కూడా ఎమ్మెల్యే సామాజిక న్యాయం పాటించినట్లు సమాచారం.
నియోజకవర్గ కేంద్రమైన మైలవరం మండల టీడీపీ అధ్యక్షుడిగా యాదవ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన జానబోయిన గోపాల స్వామి, రెడ్డిగూడెం మండల టీడీపీ అధ్యక్షుడిగా రెడ్డి (ఓసీ) సామాజికవర్గానికి చెందిన వేణుగోపాల రెడ్డి, జి.కొండూరు మండల టీడీపీ అధ్యక్షుడిగా గౌడ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన వేములకొండ వెంకటేశ్వరరావు, ఇబ్రహీంపట్నం మండల టీడీపీ అధ్యక్షుడిగా కమ్మ (ఓసీ) సామాజిక వర్గానికి చెందిన పెదర్ల రవి, విజయవాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడిగా మాదిగ (ఎస్సీ) సామాజికవర్గానికి చెందిన మంద మురళీ మోహన్ ఎన్నికయ్యారు. ఇక కొండపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడి ఎన్నికపై ఎప్పటి నుంచో ఉత్కంఠ కొనసాగుతోంది.
ఈ పదవి కోసం ఆశావహుల పోటీ తీవ్రంగా ఉండటంతో అన్ని మండలాల అధ్యక్షులను ప్రకటించి పట్టణ అధ్యక్షుడి ఎంపికను పెండింగ్ లో పెట్టారు. ఈ పదవి తమకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు ఎమ్మెల్యే వసంత వద్దకు క్యూ కట్టారు.
చివరికి ఈ పదవి ఎంపికపై ఎమ్మెల్యే వసంత పూర్తి కసరత్తు చేశారు. సామాజికవర్గ సమీకరణాలు, ఇతర అంశాలు, పరిస్థితులను అధ్యయనం చేసి పట్టణ అధ్యక్ష పదవిని కాపు (ఓసీ) సామాజికవర్గానికి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీసీ (యాదవ/ గౌడ) సామాజిక వర్గానికి రెండు, ఓసీ (కమ్మ/ రెడ్డి) సామాజిక వర్గానికి రెండు, ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి ఒకటి కేటాయించిన ఎమ్మెల్యే ఇప్పుడు కాపులకు అధ్యక్ష పదవి కేటాయించి న్యాయం చేస్తున్నారని తెలిసింది. దీనిపై అధిష్ఠానం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం.
