అచ్చంపేటలో ఫుడ్ కమిషన్ ఆకస్మిక దాడులు

అచ్చంపేటలో ఫుడ్ కమిషన్ ఆకస్మిక దాడులు

  • రేషన్ షాపు, అంగన్వాడీ, పాఠశాలలో వెలుగులోకి అవకతవకలు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సభ్యురాలు శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టణంలోని చౌకధర దుకాణం నెంబర్–6, మారుతి నగర్ అంగన్వాడీ యూనిట్–17, సివిల్ సప్లైస్ గోదాం, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వారు పర్యటించి నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

రేషన్ షాపులో అవకతవకలు
చౌకధర దుకాణం నెంబర్–6లో తనిఖీలు చేపట్టిన కమిషన్ సభ్యులు అంత్యోదయ కార్డు దారులకు చక్కెర ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. అర్హులైన లబ్ధిదారులకు సరుకులు అందకపోవడంపై డీలర్‌ను నిలదీశారు. వెంటనే చక్కెర సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని డీలర్లతో అవగాహన సమావేశం ఏర్పాటు చేయాలని సూచిస్తూ ఆ సమావేశానికి తామూ హాజరవుతామని తెలిపారు.

అంగన్వాడీలో నాసిరకం గుడ్లు
మారుతి నగర్ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ చిన్న పరిమాణంలో ఉన్న గుడ్లను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నాసిరకం గుడ్లను ఎందుకు స్వీకరించారని ప్రశ్నించారు. గుడ్లు సరఫరా చేసిన ఏజెన్సీపై చర్యలు తీసుకొని లైసెన్స్ రద్దు చేయాలని అధికారులకు సూచించారు. పిల్లల ఆట వస్తువులు పిల్లలకు అందుబాటులో లేకపోవడంపై కూడా సిబ్బందిని నిలదీశారు. ఈ విషయంపై తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై ఆగ్రహం

జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన కమిషన్ చైర్మన్ విద్యార్థులతో మాట్లాడి భోజనంపై ఆరా తీశారు. కొంతమంది విద్యార్థులు ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు తీసుకురావడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. 206 మంది విద్యార్థులకు గాను 310 గుడ్లు ఉడికించామని వంట ఏజెన్సీ చెప్పడంతో అనుమానాలు వ్యక్తం చేశారు. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ పేరుతో టమాటాలు తప్ప మరే కూరగాయలు లేవని గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సివిల్ సప్లైస్ గోదాంలో తనిఖీ

సివిల్ సప్లైస్ గోదాంలో నిల్వలో ఉన్న వస్తువులను పరిశీలించిన కమిషన్ చైర్మన్ ముఖ్యంగా చక్కెర నిల్వలను తనిఖీ చేశారు. సరుకుల పంపిణీలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మికంగా అచ్చంపేట పట్టణంలో పర్యటించడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. తనిఖీల్లో బయటపడిన అవకతవకలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

ఈ తనిఖీలలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చిన్న ఓబులేష్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, తహసీల్దార్ సైదులు, మండల విద్యాధికారి జీవన్ కుమార్, ఎన్‌ఫోర్స్మెంట్ డీటీ హేమ్ల నాయక్, సిడిపిఓ లక్ష్మి, తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply