కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) కు వరద పోటెత్తుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల మూలంగా ఓవైపు తుంగభద్ర, మరోవైపు జూరాల (Jourala) కు వరద ప్రవాహం జోరుగా ఉంది. దీంతో ఆయా ప్రాజెక్టులో కనిష్ట స్థాయిలో నీటిని నిలువ చేసుకొని వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ఇందులో జూరాల పవర్ స్టేషన్ నుంచి 28,734 క్యూసెక్కులు, స్పిల్ వే నుంచి 93,660 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతుంది. మరోవైపు సుంకేసుల బ్యారేజ్ నుంచి సుమారు 52,684 వేల క్యూసెక్కుల నీరు డ్యామ్ కు చేరుతుంది. మొత్తంగా శ్రీశైల జలాశయం ఇన్ఫ్లో1,75,078 నీటి ప్రవాహం ఉండడం విశేషం.
ఎగువ నుంచి సుమారు 1.75 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండడంతో ప్రస్తుతం శ్రీశైలం నీటిమట్టం 885 అడుగులకు గాను, 877.10 అడుగులకు చేరుకుంది. ఇంకా జలాశయంలో 215 టిఎంసిల నీటి నిల్వలకు గాను, 166.4450 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఇక జలాశయం నుంచి 67,019 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. ఇందులో కుడి విద్యుత్ కేంద్రం (Right power center) నుంచి 31,704 క్యూసెక్కులు, ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కుల చొప్పున మొత్తం 67,019 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది.
సుంకేసుల బ్యారేజ్ 12 గేట్లు ఎత్తివేత…
సుంకేసుల బ్యారేజ్ (Sunkesula Barrage) కు భారీగా వరదనీరు దీంతో బ్యారేజ్ చెందిన 12 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని సుంకేసుల బ్యారేజ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1.20 టీఎంసీలు, ప్రస్తుతం 0.80 టీఎంసీలను నిల్వ ఉంచుకొని వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువల నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం సుంకేసుల బ్యారేజ్ కి ఎగువ నుంచి సుమారు 50.064 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతుంది.