ముంపునకు కారణం అక్రమ వెంచర్లే!

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని నార్కెట్ పల్లి పట్టణం ఇందిరానగర్ కాలనీ సమీపంలో వేసిన వెంచర్లతో ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. మెయిన్ రోడ్డు కి ఇరువైపులా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి డ్రైనేజీ సౌకర్యం ఏర్పాటు చేయకుండా ప్లాట్ లు చేయడంతో సమీప కాలనీ వాసుల ఇళ్లలోకి నిన్నరాత్రి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంది. రెండేళ్ల క్రితం జిల్లా అడిషనల్ కలెక్టర్ సైతం వర్షాల సమయంలో వరద నీటి నిల్వను పరిశీలించి తక్షణమే అక్రమ వెంచర్ దారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే అఖిల పక్ష నాయకులు ప్రస్తుత కలెక్టర్ హనుమంతరావు కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు శూన్యమని వాపోతున్నారు. దీంతో అక్రమ వెంచర్లు చెరువులను తలపిస్తుండగా…ఇండ్లలోకి వరద నీరు చేరి నిరుపేద ప్రజలు, దళితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

