విమానాశ్రయంలో ఫ్లైట్ ట్రైనింగ్
కర్నూలు, ఆంధ్ర ప్రభ : కర్నూలు ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేస్తున్న ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (Flight Training Organization) (ఎఫ్‌టిఓ)కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో మంగళవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో ఘనంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకారం, మార్కెటింగ్, పశు సంవర్ధక, డైరీ అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) మాట్లాడుతూ, కర్నూలు విమానాశ్రయంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ స్థాపనతో రాష్ట్ర విమానయాన రంగం కొత్త దిశగా పయనిస్తోందన్నారు. యువతకు పైలట్ శిక్షణా అవకాశాలు లభిస్తాయని, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. పార్లమెంట్ సభ్యుడు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ..ఈ ప్రాజెక్టు కర్నూలు ప్రాంతాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేస్తుందన్నారు.
ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ, రాష్ట్రంలో విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ (Joint Collector) నూరుల్ కమర్ మాట్లాడుతూ, ఎఫ్‌టిఓ ప్రారంభంతో స్థానిక యువతకు కొత్త అవకాశాలు సృష్టించబడతాయని, కర్నూలు ప్రాంత అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ అధికారులు పాల్గొన్నారు.

