సినీ అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఓజి’. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు, ఫస్ట్ లుక్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో, పవన్ కళ్యాణ్ ‘ఓజస్ గంభీర’ అనే గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారు. దీంతో అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది.
ఈ గ్యాంగ్ స్టర్ జీవితంలో ఎమోషనల్ క్యారెక్టర్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందం ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది.

ఇందులో ఆమె ‘కన్మణి’ పాత్రలో కనిపించనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ అవతార్ పోస్టర్లకు ఇప్పటికే అద్భుతమైన స్పందన లభిస్తుండగా, ఇప్పుడు ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ కూడా సినిమాకు కొత్త లేయర్‌ను జోడించింది.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ – ప్రియాంక అరుల్ మోహన్ జంటతో పాటు ఇమ్రాన్ హష్మి విలన్‌గా, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎస్.తమన్ స్వరపరిచే సంగీతం, రవి కె చంద్రన్ – మనోజ్ పరమహంస లెన్స్ వర్క్, నవీన్ నూలి కూర్పుతో ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ అవుతుందనే నమ్మకం బలపడుతోంది.
‘ఓజీ’ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్, పోస్టర్స్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే, ఈ సినిమా 2025లోనే కాకుండా పవన్ కళ్యాణ్ కెరీర్లో కూడా మరో మైలురాయి కావడం ఖాయం అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.