- నలుగురు మావోయిస్టులు హతం
- వీరిలో ముగ్గురు మహిళలు
(ఆంధ్రప్రభ, గడ్చిరోలి) : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని అడవిలో జరిగిన ఎదురుకాల్పుల్లో (Encounter) నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టులున్నారు. వివరాలిలా ఉన్నాయి. గడ్చిరోలి డివిజన్‌లోని గడ్చిరోలి-నారాయణ్‌పూర్ (Gadchiroli-Narayanpur) సరిహద్దులోని కోపర్షి అటవీ ప్రాంతంలో సోమవారం గట్టా దళం, ప్లాటూన్ కంపెనీ నంబర్ 10 సభ్యులు సమావేశమయ్యారని విశ్వసనీయ సమాచారం పోలీసులకు చేరింది. అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆప్స్ ఎం.రమేష్ నేతృత్వంలో 19 సీ60 యూనిట్లు, సీఆర్పీఎఫ్ క్యూఏటీ 02 యూనిట్లను ఆ అటవీ ప్రాంతానికి పంపారు.
గత రెండు రోజులుగా జిల్లా లోనూ, భామ్రాగడ్ ప్రాంతం (Bhamragadh area) లోనూ కుండపోత వర్షాలను కూడా ఎదుర్కొంటూ, ఆప్స్ బృందం బుధవారం ఉదయం అటవీ ప్రాంతానికి చేరుకుంది. క్యూబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా, మావోయిస్టులు ఎదురు కాల్పులకు దిగారు. భద్రతా దళాలు ప్రతిఘటించాయి. సుమారు 8గంటల పాటు పరస్పర కాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు (Four Maoists) మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళ మావోయిస్టులు ఉన్నారు. ఎన్ కౌంటర్ (Encounter) జరిగిన ప్రాంతంలో ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్, రెండు ఇన్ సాస్ రైఫిల్స్, ఒక 303 రైఫిల్స్ – లభించాయి. మిగిలిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్ఐ లు, వీజే.రామకృష్ణ, ఎం.పెద్దయ్య, ఎస్సీ ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి, ఆర్ ఎస్ఐ లు, అమరనాథ్ రెడ్డి, చంద్రశేఖర్, అల్లాహుద్దీన్ పాల్గొన్నారు.