బంజారా సంస్కృతికి ప్రతీకగా మహోత్సవ వేడుకలు..

బంజారా సంస్కృతికి ప్రతీకగా మహోత్సవ వేడుకలు..

  • దాతృత్వంతో ముందుకు వచ్చిన బానోతు
    రమేష్ నాయక్,
  • దేవస్థానం భూమి సమస్యను జాతీయ
    స్థాయికి తీసుకువెళ్లిన కృషి ప్రశంసనీయం..

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : వరంగల్ ఉమ్మడి జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలంలోని రాంపూర్–మేడపల్లి జంట గ్రామాల్లో గల మేడపల్లి చెరువు శివారులో ఉన్న పవిత్రమైన శ్రీ సత్తియాడి లక్ష్మీదేవి దేవస్థానం జాతర ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్తులు, బంజారా నాయకులు, భక్తులు సమిష్టిగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్టీ మోర్చా నాయకుడు బానోతు రమేష్ నాయక్ తన వంతు సహాయంగా రూ.10,016/- స్వచ్ఛందంగా విరాళం అందజేయడం విశేషం. ఆ విరాళంతో బంజారా బిడ్డలకు 150 పగిడీలు పంపిణీ చేయనున్నారు. ఇలాంటి దాతల సహకారం వల్ల బంజారా సంప్రదాయాలు మరింత ఘనంగా నిలుస్తాయని గ్రామ పెద్దలు తెలిపారు.

అలాగే సత్తియాడి దేవస్థానం భూమి సమస్య పరిష్కారం కోసం బానోతు రమేష్ నాయక్ ప్రత్యేకంగా కృషి చేసి, హైదరాబాద్‌లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎన్.సి.ఎస్.టి) సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ ని కలిసి పిటిషన్ సమర్పించడం ద్వారా ఈ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన విషయం గర్వకారణమని భక్తులు పేర్కొన్నారు. దేవస్థానం భూమి పరిరక్షణలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో వరంగల్ జిల్లా బీజేపీ ప్రముఖ నాయకుడు బానోతు రమేష్ నాయక్ వివిధ తండాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, బంజారా జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సత్తియాడి జాతరకు ఆహ్వానించారు.

జాతర ప్రాముఖ్యతను వివరించి, ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు వారి సహకారం కోరారు. రాంపూర్–మేడపల్లి జంట గ్రామాలకు చెందిన గ్రామస్తులు, వరంగల్ ఉమ్మడి జిల్లా బంజారా లంబాడీ నాయకులు, కులస్తుల తరఫున జాతర అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేవస్థానానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న లంబాడి భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతం పలికారు.

భక్తుల పై ఎల్లవేళలా సత్తియాడి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని, గ్రామాల పై అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రసాదించాలని ప్రార్థించారు. జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న బృందంకు గ్రామస్తులు అభినందనలు తెలియచేశారు. ప్రతి సంవత్సరం ఈ జాతరను ఇలాగే అంగరంగ వైభవంగా నిర్వహించాలన్న లక్ష్యంతో దేవాలయ అభివృద్ధికి మరింత మంది దాతలు ముందుకు రావాలని నిర్వాహకులు కోరారు.

Leave a Reply