బ్రహ్మాండం.. బ్రహ్మ రథోత్సవం

బ్రహ్మాండం.. బ్రహ్మ రథోత్సవం
- భక్తి ఉత్సాహాలతో కదిరిలో వైభవంగా జరుగుతున్న బ్రహ్మరథోత్సవం
- గోవింద నామస్మరణతో మారుమోగతున్న పురవీధులు
శ్రీ సత్యసాయి బ్యూరో,ఆంధ్రప్రభ :పుణ్యక్షేత్రమైనకదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి, ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో అత్యంత ప్రధానమైన కార్యక్రమమైన బ్రహ్మరథోత్సవం మంగళవారం (10-03-2026) భక్తి పారవశ్యంతో, అఖండ ఆధ్యాత్మిక వాతావరణంలో అత్యంత వైభవంగా జరగుతోంది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు కదిరి పట్టణానికి తరలివచ్చారు. స్వామివారి దివ్య దర్శనం పొందేందుకు భక్తజనం ఉత్సాహంగా ఎదురుచూస్తూ కనిపించారు.
ఉదయం సుమారు 8 గంటల 45 నిమిషాలకు జరిగిన పూజా కైంకర్యాలు ముగిసిన అనంతరం బ్రహ్మరథోత్సవం ఘనంగా ప్రారంభమైంది. సంప్రదాయం ప్రకారం ముందుగా మడుగు తేరుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు నిర్వహించగా ఆ ప్రాంతమంతా మంగళవాయిద్యాల నినాదాలతో, వేదఘోషలతో ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.

ఈ పూజలు ముగిసిన అనంతరం కుటాగుళ్ల ,మూర్తిపల్లి ,గజ్లలరెడ్డిపల్లి కి చెందిన వారు రథచక్రాల్ వెనుక మొద్దు వేయడంతో రథం (తేరు) కదిలింది. తెడ్లు వేయడం వల్ల తేరు సక్రమమైన మార్గంలో ప్రయాణం చేస్తుంది. భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు గుమ్మడికాయలను సమర్పించారు. భక్తులు ఎంతో విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో సమర్పించే ఈ మొక్కులు రథోత్సవానికి ప్రత్యేక ఆధ్యాత్మికతను అందిస్తాయి. సర్వాంగ సుందరంగా పుష్పాలతో, పతాకాలతో, పట్టువస్త్రాలతో అద్భుత అలంకరణలతో శోభాయమానంగా అలంకరించిన మహారథంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
రథం కదలిక ప్రారంభమైన వెంటనే భక్తులు ఆనందోత్సాహాలతో మిర్యాలు, దవనం చల్లి స్వామివారిపై తమ భక్తి భావాన్ని వ్యక్తం చేశారు. ఆ క్షణంలో లక్షలాది మంది భక్తులు ఒకేసారి “జయ జయ సింహ… జయ శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ…” అంటూ గర్జించే నినాదాలు చేయడంతో పట్టణమంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. భక్తుల గోవింద నామస్మరణతో పురవీధులు ఆధ్యాత్మిక పరవశంతో నిండిపోయాయి.
సర్వాంగ సుందరమైన సమ్మోహనాకర రూపంలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి మహారథంపై విహరిస్తూ కదిరి పట్టణ తిరు వీధుల్లో భక్తులకు దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు. స్వామివారి దివ్య మంగళవిగ్రహాన్ని దర్శించేందుకు పురవీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దివ్య దర్శనం పొందిన భక్తులు ఆనందభాష్పాలతో నమస్కరిస్తూ భక్తి పరవశంలో మునిగిపోయారు.
ఈ రథోత్సవానికి మరో ప్రత్యేక ఆకర్షణ కదిరి పట్టణ ప్రజల సేవా భావం. రథోత్సవానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పట్టణ ప్రజలు స్వచ్చందంగా సేవలందించారు. ఉదయం నుంచే భక్తులకు అల్పాహారం, భోజనం, మజ్జిగ, శీతల పానీయాలు, బిస్కెట్లు, చాక్లెట్లు, కేకులు వంటి అనేక తిండి పదార్థాలను ఉచితంగా పంపిణీ చేశారు. భక్తులు అలసట చెందకుండా, సౌకర్యంగా స్వామివారి దర్శనం పొందేందుకు పట్టణ ప్రజలు విరామం లేకుండా సేవలందించడం ప్రత్యేకంగా నిలిచింది.
భక్తి, సేవా భావం, ఆధ్యాత్మిక ఉత్సాహం కలిసి ఈ బ్రహ్మరథోత్సవాన్ని మహోత్సవంగా మార్చాయి. కదిరి పట్టణం మొత్తం ఆధ్యాత్మిక క్షేత్రంలా మారి, ప్రతి వీధిలో గోవింద నామస్మరణతో భక్తి తరంగాలు వెల్లివిరిశాయి.
