లారీ, స్కూటీ ఢీ..!

లారీ, స్కూటీ ఢీ..!

  • స్పాట్‌లో ముగ్గురి మృతి
  • మృతుల్లో భార్య, భర్తలు, కూతురు
  • గాయాలతో బయటపడిన కుమారుడు
  • పెద్దేముల్ తట్టెపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

తాండూరు, ఆంధ్రప్రభ : లారీ, స్కూటీ ఢీ కొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య, భర్త, కూతురు ముగ్గురు స్పాట్‌లో మృతి చెందగా కుమారుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన పెద్దేముల్ మండలం తట్టెపల్లి సమీపంలో కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం మేరకు.. జహీరాబాద్‌కు చెందిన కవిరాజ్‌(40) భార్య పావని(35), కుమారుడు కార్తిక్(13), కూతురు కీర్తన(11)తో కలిసి అత్తాగారి ఊరు అయిన పెద్దేముల్ మండలం రుక్మాపూర్‌కు వచ్చారు.

సోమవారం ఉదయం రుక్మాపూర్‌ నుంచి కవిరాజ్ స్కూటీపై భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జహీరాబాద్‌కు బయల్దేరారు. మార్గ మద్యలోని పెద్దేముల్ మండలం తట్టెపల్లి సమీపంలోకి రాగానే జహీరాబాద్ వైపు నుంచి వస్తున్న ఓ లారీ స్కూటీని ఢీ కొట్టింది. ఈ క్రమంలో స్కూటీపై ఉన్న కవిరాజ్‌తో పాటు భార్య, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు గాయాలతో బయటపడ్డాడు. గమనించిన స్థానికులు పెద్దేముల్ పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో తల్లిదండ్రుల మృతదేహాల వద్ద కుమారుడు రోధిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. కుమారుడుని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply