కర్నూలు : కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాండవగల్లు – గణేకల్లు గ్రామాల మధ్య కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రెండు బైకులను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బైకులపై ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారి మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్ని కుప్పగల్ గ్రామానికి చెందిన దంపతులు ఈరన్న,ఆదిలక్ష్మి, మాన్వీకి చెందిన దేవరాజు, నాగరత్నమ్మగా పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే… కాగా ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు ఆదోని మండలం కుప్పగల్లు గ్రామానికి చెందిన వారిలో ఇద్దరు ఉండగా, మరో ఇద్దరు కర్ణాటక రాష్ట్రం మానవి గ్రామానికి చెందిన వారు కావడం విశేషం. ఈ ప్రమాదం గంగావతి డిపోకు చెందిన బస్సు ఆదోని నుంచి రాయచూరు వెళ్తుండగా జరిగింది. ప్రమాదానికి బస్సు అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
రెండు బైకులపై ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు తీవ్రంగా గాయపడి, ఘటనా స్థలంలోనే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో పరిసర ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.