Farmers | ఏపీలో యాపిల్ పంట సంచలనం.. రాయలసీమ రైతు విజయం

Farmers | ఏపీలో యాపిల్ పంట సంచలనం.. రాయలసీమ రైతు విజయం
Farmers | కోతకు వచ్చిన తొలి పంట.. ఎకరాకు టన్ను దిగుబడి..
అనంత యాపిల్’ పేరుతో గిఫ్ట్ ప్యాక్‌లుగా అమ్మకాలు
సాగు ప్రోత్సాహానికి అధ్యయనం: ఉద్యానశాఖ డైరెక్టర్
తొలి పంటలోనే టన్ను దిగుబడి
‘అనంత యాపిల్’కు మార్కెట్‌లో డిమాండ్
ఉద్యానశాఖ ఆశాజనక అంచనాలు
వ్యాపారి నుంచి విజయవంతమైన రైతుగా రమణారెడ్డి ప్రయాణం
Farmers | అమరావతి, ఆంధ్రప్రభ : చల్లని, మంచు ప్రాంతాల్లో పండే యాపిల్ పంట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కూ విస్తరించింది. ఉద్యాన పంటలకు నిలయంగా మారుతున్న రాయలసీమలో యాపిల్ సాగు ప్రారంభమైంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె, కుందుర్పి, పెద్దపప్పూరు మండలాల్లో ముగ్గురు రైతులు యాపిల్ సాగు చేపట్టి, సుమారు 15 ఎకరాల్లో తోటలు అభివృద్ధి చేశారు.
స్థానిక వాతావరణానికి అనుకూలంగా ఉండే కాశ్మీర్ లో చిల్లీ డెలిషియస్ (KLD) రకాన్ని రైతులు పండిస్తున్నారు. గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి రెండున్నర ఎకరాల్లో 2024 జూలైలో 1,500 యాపిల్ మొక్కలు నాటారు. ఒక్కో మొక్క ధర రూ.280. పశువుల ఎరువులు, యూరియా, పొటాష్, ఫాస్ఫేట్ వంటి ఎరువులు వాడుతూ, కీటకాలు నివారించేందుకు కాయలకు కవర్లు వేస్తున్నారు.
డిసెంబరులో పూతకు వచ్చిన చెట్లు ప్రస్తుతం కాయలు కాసి కోతకు సిద్ధమయ్యాయి. తొలి పంట కొంత తక్కువగా ఉన్నప్పటికీ, ఎకరాకు సుమారు ఒక టన్ను దిగుబడి వచ్చినట్లు రైతులు తెలిపారు. మధ్యస్థ పరిమాణంలో ఉన్న ఈ యాపిళ్లు కాశ్మీర్ పండ్ల కంటే తియ్యగా, రుచిగా ఉన్నాయని చెబుతున్నారు. మార్కెట్‌లో నాణ్యమైన పండ్లు కిలోకు రూ.170 వరకు, సాధారణ నాణ్యత పండ్లు రూ.120 వరకు ధర పలుకుతున్నాయి.
Farmers | దిగుబడి ఇంకా పెరుగుతుంది: ఉద్యానశాఖ
సరైన నిర్వహణతో రాబోయే రోజుల్లో రాయలసీమలో యాపిల్ దిగుబడి మరింత మెరుగుపడుతుందని ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ‘అనంత యాపిల్’ పేరుతో గిఫ్ట్ ప్యాక్‌లుగా విక్రయిస్తున్న ఈ పండ్లకు స్థానికంగా మంచి డిమాండ్ ఏర్పడింది. ఇటీవల అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ యాపిళ్లను పరిశీలించి రైతులను అభినందించారు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న అనంతపురం ప్రాంతంలో కూడా యాపిల్ సాగు సాధ్యమవుతుందా అనే అంశంపై అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తల బృందాన్ని నియమించినట్లు తెలిపారు. భవిష్యత్తులో రాయలసీమతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా యాపిల్ సాగును ప్రోత్సహించే యోచనలో ఉన్నట్లు చెప్పారు.
Farmers | వ్యాపారి నుంచి విజయవంతమైన రైతుగా… రమణారెడ్డి
అనంతపురం అంటే ఎండలు, కరువు గుర్తుకు వచ్చే ప్రాంతం. అలాంటి నేలపై యాపిల్ పండించి విజయం సాధించిన రైతు రమణారెడ్డి ప్రత్యేకంగా నిలిచారు. రెండున్నర ఎకరాల్లో 1,500 మొక్కలు నాటి, తొలి పంటను సుమారు టన్ను రూ.1.50 లక్షలకు విక్రయించారు. ముందుగా పట్టు చీరల వ్యాపారం చేసిన ఆయన, ఆ తర్వాత వ్యవసాయంపై ఆసక్తి పెంచుకున్నారు. గార్లదిన్నె మండలం మర్తాడు, కోటంక గ్రామాల్లో భూములు కొనుగోలు చేసి, డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరం పంటలతో లాభాలు ఆర్జించారు. యాపిల్ సాగులో తొలుత విఫలమైనా, వెనక్కు తగ్గకుండా, ఇజ్రాయెల్ వంటి వేడి ప్రాంతాల్లో పండే రకాలపై పరిశోధించి KLD రకం మొక్కలు తెప్పించి సాగు ప్రారంభించారు.
మొక్కలపై పిందెలు ఎక్కువగా రావడంతో ఒక్కో మొక్కకు 130–150 పిందెలను మాత్రమే ఉంచి మిగిలినవాటిని తొలగించడం ద్వారా నాణ్యమైన దిగుబడి సాధించారు. తొలి కోతలో కిలోకు రూ.150 చొప్పున అమ్మకం జరిపారు. యాపిల్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులు తనను సంప్రదిస్తే సూచనలు ఇస్తానని రమణారెడ్డి తెలిపారు.
