శ్రీకాకుళం: ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ నుంచి బోగీలు విడిపోయాయి.
దీంతో రైలును అధికారులు పలాస వద్ద నిలిపివేశారు. విడిపోయిన బోగీలను సిబ్బంది రైలుకు అమరుస్తున్నారు. దీంతో గంట నుంచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కాగా, ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. విడిపోయిన బోగీలను రైలుకు బిగిస్తున్నామని, వీలైనంత తొందర్లోనే తన గమ్యస్థానానికి బయల్దేరుతుందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.