ADB | నకిలీ స్టాంప్ పేపర్ల తయారీ రాకెట్ గుట్టురట్టు

- కంప్యూటర్, హార్డ్ డిస్క్, స్టాంపులు, డాక్యుమెంట్లు స్వాధీనం
- ఒకరు అరెస్టు.. మరొకరు పరారీ
- నిందితులిద్దరూ తండ్రి, కొడుకులు
- ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహల్
ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా నకిలీ స్టాంప్ పేపర్లు (Fake stamp papers) , ఇళ్ల స్థలాలకు సంబంధించి నకిలీ పట్టాలు , మున్సిపల్, రెవెన్యూ అధికారులు జారీ చేసే సర్టిఫికెట్లను తయారు చేస్తున్న రాకెట్ గుట్టును పోలీసులు ఛేదించారు. తండ్రి, కొడుకులు ఇద్దరు కలిసి కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఫేక్ సర్టిఫికెట్లు (Fake certificates) తయారు చేస్తున్న సంగతి పోలీసుల దృష్టికి వచ్చింది. దీనిపై నిఘా వేసి స్థావరంపై దాడి చేసి కంప్యూటర్, 19 జీబీ హార్డ్ డిస్క్, ప్రభుత్వ పథకాలకు లబ్ధి చేకూర్చే పలు కీలకమైన సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.
నిందితులిద్దరూ తండ్రీ, కొడుకులు..
ఆదిలాబాద్‌లో శనివారం నాడు ఎస్పీ అఖిల్ మహల్ (SP Akhil Mahal) మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రాకెట్ వివరాలను వెల్లడించారు. నిందితులైన లాడ్వీ రాహుల్ కుమార్, ఆయన తండ్రి లాడ్వీ బద్రీనాథ్ ఇద్దరు కలసి ప్రభుత్వ శాఖలకు సంబంధించి అధికారుల సంతకాలతో కూడిన స్టాంపులు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బర్త్ సర్టిఫికెట్లు (Fake birth certificates) తయారు చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారని తెలిపారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ కౌన్సిల్ ఆఫీసులకు సంబంధించి నకిలీ పత్రాలు, స్టాంపులు తయారు చేస్తున్నారు.
ఒకరి అరెస్టు.. మరొకరు పరారీ
నిందితుడు లాడ్వీ రాహుల్ కుమార్ (Ladvi Rahul Kumar) పరారీలో ఉన్నారని, ఆయన తండ్రి లాడ్వీ బద్రీనాథ్ (Ladvi Badrinath) ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఒక కంప్యూటర్, స్కానర్, హార్డ్ డిస్క్ లతో పాటు ఇందుకు వినియోగించే పరికరాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన కంప్యూటర్, స్కానర్, స్టాంప్ పేపర్లను నిజ నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతున్నట్టు తెలిపారు. ఈ స్కాంను బయటపెట్టిన సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, వన్ టౌన్ ఎస్ఐ బి సునీల్ కుమార్ ను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మీడియా సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
