Exhibition | కూల్చివేతకు రంగం సిద్ధం..

Exhibition | కూల్చివేతకు రంగం సిద్ధం..
- జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ్ అమరావతి నిర్వహణ..
- సిఎం రాక దృష్ట్యా ఎగ్జిబిషన్ లో నమూనాలను తొలగించాలని కలెక్టర్ ఆదేశాలు..
- రంగంలోకి దిగిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది..
- అడ్డుపడిన నిర్వాహకులు..
- అన్ని అనుమతులు ఉన్నా కూల్చివేస్తుండడంపై మండిపాటు..
- ఎగ్జిబిషన్ కోసం కోట్లు పెట్టుబడి పెట్టామంటున్న నిర్వాహకులు..
- మరణమే శరణ్యం అంటున్న ఎగ్జిబిషన్ నిర్వాహకులు..
Exhibition , విజయవాడ, ఆంధ్రప్రభ : భవానీపురంలోని బబ్బూరి గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ తొలగింపు వివాదాస్పదంగా మారింది. జనవరి 8 నుంచి మూడు రోజుల పాటు పున్నమిఘాట్ లో ఆవకాయ్ అమరావతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే.. సీఎం రాక దృష్ట్యా చుట్టుప్రక్కల అన్నీ ఖాళీ చేయిస్తున్నారు. అందులో భాగంగా పున్నమిలో ఎగ్జిబిషన్ ను నిలిపివేశారు. దాంతో పాటు బబ్బూరి గ్రౌండ్స్ లోని ప్రైవేట్ స్ధలంలో మరో ఎగ్జిబిషన్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నతరుణంలో కలెక్టర్ ఆదేశాలంటూ కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేయడంతో నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు.
సాధారణంగా ప్రైవేట్ స్ధలంలో ఏమైనా కూల్చాలన్నా ముందస్తుగా నోటీసులు ఇవ్వాలి. కానీ.. అలా ఏమీ లేకుండా నేరుగా కూల్చివేస్తున్నామంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు మందీ మార్బలంతో రావడంతో బబ్బూరి గ్రౌండ్స్ వద్ద స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కలెక్టర్ ఆదేశాలు తాము ఏమీ చేయలేమని అధికారులు చెబుతుండడంతో మరి.. అన్ని శాఖలు ఏ విధంగా అనుమతులు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు నిర్వాహకులు.

ఎగ్జిబిషన్ నిర్వాహకులు మాట్లాడుతూ.. కోట్లాది రూపాయలు వెచ్చించి ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని, ఇప్పటికే అంతా సిద్ధమైందని, జనవరి 5 వ తేదీన ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఒక్కసారిగా కూల్చివేస్తున్నామని అధికారులు రావడం సరైంది కాదన్నారు. తాము ఎగ్జిబిషన్ కోసం మునిసిపల్ టౌన్ ప్లానింగ్, శానిటేషన్ , ఫైర్ అదే విధంగా ట్రాఫిక్, లాండ్ ఆర్డర్ పోలీస్, ఇలా పలు శాఖల నుండి ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడానికి కావలసిన అన్ని అనుమతులు తెచ్చుకున్నామన్నారు.
దాదాపుగా 60 రోజుల నుండి రోజుకి 100 మంది చేత 50 రోజుల నుంచి నమూనాలు కూడా ఎగ్జిబిషన్లో నిర్వహించడం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ కూడా వేరొక కార్యక్రమం పక్కన ఉందని తమను రోడ్డు పాలు చేయడం సమంజసం కాదన్నారు. ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ వస్తే.. ఆ మూడు రోజులు ఎగ్బిబిషన్ నడపమని, అవసరమైతే మా పార్కింగ్ ప్రదేశం కూడా ఇస్తామని చెప్పామని, అయినా కూడా వినకుండా కూల్చివేసేందుకు వస్తున్నారని, ఎగ్జిబిషన్ కూల్చివేస్తే మాత్రం తమకు మరణమే శరణ్యమన్నారు. కలెక్టర్ ఇప్పటికైనా ఎగ్జిబిషన్ కూల్చివేయకుండా ఆపాలని కోరారు.

