Exclusive |డంకీ డాంకీ దమ్కీ … అమెరికా దొడ్డిదారి ఆషామాషీ కాదు గురూ

డంకీ రూట్‌లో అమెరికాలో ప్రవేశించారంటూ.. అక్రమ వలసదారుల పేరిట 104 మంది భారతీయ యువకుల్ని ..అమెరికా తిప్పి పంపించిన నేపథ్యంలో.. అక్రమ చొరబాటుకు యత్నించిన మరో భారతీయుడి గుండె ఆగిపోయింది. డంకీ రూట్‌లో అమెరికా వెళ్తున్న ఓ పంజాబీ యువకుడు దారి మధ్యలోనే ప్రాణాలు వదిలాడు. ఇటీవల వెలుగు చూసిన డంకీ డాంకీ రూట్ కథలన్నీ దయనీయమే. సొంత ఊళ్లో భూములమ్మి పరాయి దేశంలో గాడిద చాకిరికి బయలుదేరి.. కడకు ఎలాంటి దయనీయ బతుకును అనుభవిస్తున్నారో.. తెలిస్తే గుండె జావగారిపోవాల్సిందే. అమెరికాలో ఓ కారు పక్కన స్టిల్ ఫోటో పంపిస్తే చాలు.. మావాడు అమెరికాలో కారు కొనేశాడని అమ్మానాన్న సంబరపడిపోతారు. స్టార్ హోటల్ ప్రాంగణంలో ఫోటో పంపిస్తే అమ్మో మనోడు చూడు ఎంత పెద్ద బిల్డింగ్‌లో పని చేస్తున్నాడో .. అని ఊరు మొత్తానికి చూపిస్తారు. కానీ అక్కడ తన కొడుకు వాష్ రూమ్ క్లీనరని తెలీదు. ఇది సరే.. దొడ్డి దారిన అమెరికా వెళ్లటానికి అరకోటి పైనే ఖర్చు చేస్తే.. దారి మధ్యలోనే అక్కడి పోలీసులు అడ్డుకొని జైలులో పెడితే గానీ అసలు కథ వెలుగులోకి రాదు. ఇక దారి మధ్యలో చచ్చిపోతే శవానికి దారి ఖర్చులు కూడా లేక తల్లిదండ్రులు ఎంతగా రోధిస్తారో?. ఇంతకీ అమెరికాలో ఉద్యోగం సరే.. అసలీ దొడ్డిదారి కథేంటీ .. కష్టాలేంటీ? అసలు డింకీ డాంకీ మాఫియా సంగతేంటీ ..తెలుసుకుందాం.

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అమెరికాలో డాలర్లు… యూరప్‌లో యూరో నోట్లు సంపాదిస్తే చాలు.. భారత్‌లో కోటీశ్వరులవుతారనే అత్యాశతో.. వీసాలతో పనిలేకుండా అక్రమంగా ఆయా దేశాలకు భారతీయులు వలస పోతున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ 104 మంది భారతీయ పౌరులను బహిష్కరించి.. సైనిక విమానంలో అమెరికా నిర్ధాక్షిణ్యంగా తిప్పి పంపించిన ఘటనతో.. అసలు డంకీ డాంకీ రూట్ కథలో ఎన్నో కన్నీటి కథల వెనుక చీకటి నిజాలు తెలుసుకుందాం. ఎలాంటి వీసాలు లేకుండా 7, 25, 000 మంది భారతీయులు తమ దేశంలో ప్రవేశించారని అమెరికా లెక్కలు చెబుతోంది. ఇక 2.5 లక్షల మంది భారతీయులు అక్రమంగా తమ దేశాల్లో ఉన్నారని ఐరోపా దేశాలు చెబుతున్నాయి.

ఇక అరబ్ కంట్రీల్లోనూ ఇవే కథలు వినిపిస్తున్నాయి. అసలు ఇలా దొడ్డి దారిలో వలస కార్మికులను పంపించే డింకీ డాంకీ మాఫియా కథలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వదేశీ యువత ఉపాధిపైనే దృష్టిపెట్టారు. అందుకే భారతీయ వలస కార్మికుల సామూహిక బహిష్కరణ ప్రణాళికలో భాగంగా దాదాపు 20,000 మంది భారతీయ అక్రమ వలసదారులను గుర్తించింది. అసలు ఇంత మంది అమెరికాలో ఎలా ప్రవేశించారంటే.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తాము వలస వెళ్లాలనుకునే ప్రదేశాలకు చేరుకోవడానికి అనుమతులు ఉండవు. ఆర్థిక స్థితి సరిపోదు. ఇక దొడ్డి దారినే ఎంచుకోవాలి. ఈ దారిలో చాలా దూరం ప్రయాణించాలి. తరచుగా ప్రమాదాలు తప్పవు. ఇందుకు డంకీ.. గాడిద మార్గమే అనువైంది.

అమెరికాకు దొడ్డి దారులెన్నో…?

అమెరికా ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ప్రకారం, హోండురాస్, మెక్సికో, గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ వీసాలతో అమెరికాలోకి భారతీయ వలసదారులు ప్రవేశిస్తున్నారు. ఢిల్లీ పోలీస్ విశ్లేషణ ప్రకారం, అక్రమ వలసదారులను ఆన్ –అరైవల్ వీసా సౌకర్యాలు ఉన్న దేశాలకు డింకీ ఏజెంట్లు చేరుస్తారు. ఈ నకిలీ స్కెంజెన్ వీసాల ప్రయాణీకులను అజర్‌ బైజాన్, కజకిస్తాన్ వంటి సాపేక్షంగా అందుబాటులోని యూరోపియన్ దేశాలకు పంపిస్తారు. అక్కడి నుంచి గ్వాటెమాల, కోస్టారికా తదితర సెంట్రల్ అమెరికా, కరేబియన్ దేశాలకు దారి మళ్లిస్తారు.

టూరిస్ట్ వీసాపై టర్కీకి , కజకిస్తాన్‌కు వీసా ఆన్ అరైవల్‌పై వెళ్లి, అక్కడి నుంచి రష్యాకు డంకీ రూట్లో వెళ్తారు. ఇక బ్యాంకాక్ నుంచి మలేషియాకు కేవలం 15 నిమిషాల బస్సులో వెళ్తారు. లేకపోతే బోటులో 20 నిమిషాల్లో చేరుతారు.ఇది సరే కొందరు మెక్సికోకు వెళ్లే ముందు నకిలీ స్కెంజెన్ వీసాను పొందుతారు. ఇక్కడ అమెరికా వీసాను అందుకుంటారు. ఇక్కడ నుంచి సరిహద్దు పాయింట్లల్లో అనేక కిలోమీటర్లు ప్రయాణించి డంకీ మార్గంలో అమెరికా చేరుతారు.

గత కొన్ని నెలలుగా, 19 ఏళ్ల నిశాంత్ కుమార్ జనవరి 13న మెక్సికోతో దాని సరిహద్దు గుండా యునైటెడ్ స్టేట్స్‌లోకి ప్రవేశించడానికి ముందు 16 దేశాలకు వెళ్లాడు, అతని బృందం కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకు చేరుకున్న వెంటనే సరిహద్దు గస్తీ ద్వారా పట్టుకోబడ్డాడు.

డంకీ రూట్లో డాంకీ కష్టాలెన్నో…

భారత్‌ నుంచి అమెరికాకు దొడ్డిదారిలో వెళ్లటమంటే ఆషామాషీ కాదు. ఇటీవల అమెరికా వెనక్కి తోలిన వలస బాధితుడి కథనం ప్రకారం.. అతడు హర్యానా యువకుడు. తండ్రికి అర ఎకరం భూమి ఉంది. చెరకు, గోధుమ, వరి పండిస్తారు. ఆ కుటుబంలో ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ బిడ్డ. ఆ ఊరి నుంచి ఎందరో అమెరికా వెళ్లారు. ఈ కుర్రోడు కూడా అమెరికా వెళ్లి స్థిరపడి తన కుటుంబాన్ని కోట్లకు పడగలెత్తించాలని ఆశించాడు. కర్నాల్ ప్రాంతానికి చెందిన డంకీ ఏజెంటును కలిశాడు. మే 27న అమెరికాకు బయలుదేరాడు. వారం రోజుల్లో అమెరికా చేరుతావని ఏజెంటు ఈ కుర్రోడిని దుబాయ్ కి పంపించాడు. దుబాయ్ లోనే నెలరోజులు ఉన్నాడు. వీసా గడువు ముగిసింది. తిరిగి ఇంటికి చేర్చటానికి 11 రోజులు గడిచాయి. తొలి ప్రయత్నమే విఫలమైంది.

డంకీ ఏజెంట్ పట్టువదలలేదు. జులై 11న శ్రీలంకకు పంపించాడు. ఇక అమెరికా వెళ్లటానికి ఈ కుర్రోడికి 12 రోజులు పడిగాపులు తప్పలేదు. మళ్లీ అవకాశం తప్పింది. సెప్టెంబరు 6న, మరో 13 మందితో గయానాకు చేరుకున్నాడు. 15 రోజుల తరువాత రెండు ట్యాక్సీలలో బ్రెజిల్‌కు చేరాడు. వీళ్లకి గయానా గైడ్ సాయం చేశాడు. బ్రెజిల్‌లో మూడు రోజులు ఉన్నారు. రెండు బస్సుల్లో బొలీవియాకు చేరుకున్నారు. ఇక్కడ మరో బృందంతో జత కలిశారు. ఈ బృందంలో వియత్నాం, చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ కుర్రోళ్లు ఉన్నారు. రెండు రోజులు తర్వాత, మరొక సెట్ బస్సులో పెరూకి వెళ్లారు.

.

బొలీవియాలో ఈ కుర్రోడి పాస్‌పోర్టును ‘డంకీ’ ఏజెంట్లు తీసుకున్నారు. పెరూలో ఒక రోజు బస తరువాత మరొక సెట్ బస్సులో ఈక్వెడార్ మీదుగా కొలంబియాకు చేరారు. మూడు నెలలు కొలంబియాలో ఉన్నారు. కొలంబియా సరిహద్దును దాటి వారం రోజులు కాలినడకన పనామాలోకి ప్రవేశించారు. అడవులు, ఖాళీ భూముల్ని దాటారు. ఆ రోజుల్లో బిస్కెట్లు, కాయలతో ఆకలి తీర్చుకున్నారు. పనామా నుంచి కోస్టారికా వెళ్లారు. అక్కడ ఒకరోజు బస చేశారు. అనంతరం బస్సులో నికరాగ్వా చేరుకోగా.. అక్కడి నుంచి హోండురాస్‌కు చేరారు.

Inహోండురాస్ నుండి, ఒక ఏజెంట్ ఈ బృందాన్ని మెక్సికోకు తీసుకెళ్లాడు. అక్కడ హర్యానా కుర్రోడికి నేపాలీ పాస్‌పోర్ట్ , ఐడీ ఇచ్చారు. ఇక విమానంలో టిజువానాకు చేరారు. టిజువానా సరిహద్దులో ఒక రోజు తర్వాత, జనవరి 13న శాన్ డియాగోకు పంపారు. ఈ బృందం సరిహద్దు దాటిన వెంటనే శాన్ డియాగో పోలీసులు తనిఖీ చేస్తారని, ఆ తరువాత అనుమతిస్తారని ఏజెంట్ చెప్పాడు. కానీ కథ అడ్డం తిరిగింది. మరో 15 మైళ్లు వెళ్తే శాన్ డియాగోలో ప్రవేశిస్తారు. కానీ పోలీసులకు దొరికిపోయారు. 21 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నారు.

డాంకీ రూట్ లో అడ్డంగా దొరికిన కుర్రోడి కథ.

ఇందుకు అతడికి కేవల రూ.40 లక్షలే ఖర్చు అయ్యాయి. ప్రాణాలొదిలిన పంజాబీ తాజాగా ఓ పంజాబీ యువకుడు డంకీ రూట్ లో అమెరికాకు వెళ్తూ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. గుర్ ప్రీత్ సింగ్ (33) అనే వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ విషయాన్ని గుర్ ప్రీత్ సింగ్ కుటుంబసభ్యులు ధృవీకరించారు. గుర్‌ప్రీత్‌ మూడు నెలల కిందట అమెరికా వెళ్లేందుకు ఇంటి నుంచి బయల్దేరాడు. ఈ ప్రయాణానికి చండీగఢ్‌కు చెందిన ఏజెంట్‌ బల్వీందర్‌సింగ్‌ను సంప్రదించి రూ. 16.5 లక్షలు చెల్లించాడని అతని సోదరుడు వెల్లడించాడు. అక్కడ పాకిస్థానీ ఏజెంట్ మహమ్మద్ కు బాధ్యతలు అప్పగించాడని, అనంతరం మరికొందరు వలసదారులతో కలసి పలు దారుల్లో అమెరికాకు బయల్దేరాడు.

పనామా అడవి గుండా గుర్ ప్రీత్ కొలంబియాకు బయల్దేరాడని, ఇప్పటికే పాకిస్తాన్ ఏజెంట్ రూ.18-20 లక్షలు తీసుకున్నాడని చెప్పాడు. ఈ క్రమంలోనే తమకు ఫోన్ చేసి గ్వాటమాలాలో ఉన్నట్టు చెప్పాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఆ తర్వాత ఓ వ్యక్తి తమకు ఫోన్ చేసి గుర్ ప్రీత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారని, కారులో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడని అన్నారు. ఇది జరిగిన 5 -7 నిమిషాల్లోనే తన సోదరుడు చనిపోయినట్టు సమాచారమిచ్చారని గుర్ ప్రీత్ సోదరుడు తారాసింగ్ మీడియాకు వివరించాడు. తన సోదరుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ఆయన కన్నీరుమున్నీరయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *