Exclusive | అదే జ‌గ‌డం! ..హద్దులు లేని రీ సర్వే – ఏపీలో అంతా అయోమయం

తీర‌ని పేచీలు
అప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్షన్
ఇప్పుడు హద్దులు లేని రీ సర్వే
ఇటు రిజిస్ర్టేషన్లకు విఘాతం
అటు బ్యాక్ డోర్‌లో స్టాంపుల గుద్దుడే గుద్దుడు
ఏపీలో అంతా అయోమయం

స్వమిత్వ యోజనతో గ్రామీణ భారతంలోని 3 లక్షల పల్లెల్లో రూ. 100 లక్షల కోట్ల ఆస్తులకు విముక్తి కల్పించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అధునాతన డ్రోన్, జీఐఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి 2.25 లక్షల మందికి ఆస్తి కార్డులు, రిరార్డ్ ఆఫ్ రైట్స్ ను అందిచినట్టు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే.. ఈ భూ వివాదాలు ఇప్పట్లో పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించటం లేదు. జానెడు భూమి కోసం భూస్వాములు.. పేదల మధ్య పేచీ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం పంచిన అసైన్డ్ భూములనూ పెత్తందారులు కొల్లగొట్టేస్తున్నారు. న్యాయం కోసం పేదలు కోర్టు తలుపు తడితే.. జీవిత కాలం విచారణ తట్టుకోలేక…పేదలే తమ హక్కులను పెద్దోళ్లకు ధారాదత్తం చేయక తప్పటం లేదు. ఇక ఏపీలో టైట్లింగ్ యాక్టుతో ..సుమారు రూ.2లక్షల కోట్ల చుక్కల భూముల్ని కొల్లగొట్టిన రాజకీయ పెత్తందారులు జనానికి చూపించారు. ఏకంగా రైతు భూమిలో సరిహద్దును సీఎం ముఖ చిత్రం సర్వేరాళ్లు నిర్ధారించాయి. భూమి హక్కులను సీఎం ముఖచిత్రం ఖరారు చేసింది. అన్నిటికంటే.. అసైన్డ్ భూముల్లో పేదల హక్కుల్ని కాలరాశారని కూటమి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్టును తెరమీదకు తీసుకు వచ్చారు. మళ్లీ ఈ భూముల రీసర్వేను షురూ చేసింది. హమ్మయ్యా .. పెద్దోళ్లు గుంజుకున్న భూములు తమ చేతికి వస్తాయని పేదోళ్లు సంబురం చేసుకొంటున్నారు. కానీ ఈ భూ జగడాలు ఇప్పట్లో తీరటం .. మామూలు కథ కాదు.. ఇది నిజంగా ఓ నైట్ మేర్ స్టోరీనే.. అని పరిశీలకుల అంచనా.

( ఆంధ్రప్రభ , సెంట్రల్ డెస్క్ )
ల్యాండ్ టైట్లింగ్ పోయింది. ల్యాండ్ గ్రాంబింగ్ ప్రివెంటివ్ యాక్ట్ వచ్చింది. పిల్లి పిల్లి మధ్య చేరిన కోతి మాదిరి.. ప్రస్తుతం రీ సర్వే వ్యవహారం సిత్రాలు మీద సిత్రాలు చూపిస్తోంది. భూమి రీ సర్వేతో గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. అసలు టైట్లింగ్ యాక్ట్ మంచిది కాదని, దీనిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు అసెంబ్లీలో ల్యాండ్ గ్రాంబింగ్ ప్రివెంటివ్ యాక్ట్ బిల్లు పెట్టి ప్రభుత్వం ఆమోదించింది. అందరూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అయిందని హ్యాపీ పీలయ్యారు. భూమి రీ సర్వే ను ప్రభుత్వం ప్రారంభించింది. గతంలో మాదిరి త్వరగా సర్వే పూర్తి చేయటానికి ప్రయత్నించటం లేదు. ప్రతి వివాదంలోనూ ఆచీతూచీ వ్యవహరిస్తోంది. ఏ రోజు ఏ ప్రాంతానికి రీ సర్వే చేసేందుకు సర్వేయర్లు వస్తున్నారో ఆ ప్రాంత పొలాల రైతులకు ముందు రోజు సమాచారం ఇస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ, వివాదాల పరిష్కారం జోలికి వెళ్లటం లేదు. ఎందుకంటే ఎవరి హద్దుల్ని వారికే అప్పగించాలని లక్ష్యం కావచ్చు.

హద్దులు లేని కొలతలు

వాస్తవ రెవెన్యూ రికార్డు ప్రకారం, ఏపీలోని 17,583 గ్రామాల్లో 1,30,30,298 సర్వే నంబర్లు ఉన్నా యి. వీటితో 2,90,92,995 ఎకరాల విస్తీర్ణంలోని భూమితో ముడిపడి ఉంది. వెబ్‌ల్యాండ్‌ ఆర్‌ఎస్ ఆర్‌లో 1,35, 05,283 సర్వేనంబర్లలో 3,40,23,510 ఎకరాల భూమి ఉన్నట్లు ప్రభుత్వ నివేదిక చెబుతోంది. కానీ సర్వే చేసేటప్పుడు ఎవరి భూమి ఎంతవరకు ఉందో రైతే చూపించాలి. వాస్తవానికి ఎవరి పేరుతో ఏ సర్వే నెంబరులో ఎంత భూమి ఉందో రికార్డుల్లో ఉంటుంది. ఆ వివరాలు కూడా సర్వేయరు వద్ద ఉంటాయి. ఇద్దరు రైతుల మధ్య గట్టు సమస్యలు కావొచ్చు. ఒకరి పొలాన్ని మరొకరు ఆక్రమించుకుని ఉండొచ్చు. ఆ విషయం వారికి చెబితే అది పరిష్కరించే పని మాది కాదు. కొలత వరకు మాత్రమే చేస్తాం అని సర్వేయర్లు అంటున్నారు. ఎవరి పొలం ఎంత ఉంది. ఎక్కడి వరకు ఉందో చెబితే దాని ప్రకారం హద్దులు నిర్ణయిస్తున్నారు. అలా కాకుండా సమస్య ఉన్న చోట హద్దులు ఫిక్స్ చేయకుండా ఎవరి పేరుతో ఎంత పొలం ఉందో గతంలో ఉన్న వివరాల ప్రకారం వివాదంలోని పొలాలన్నింటికీ ఒకే నెంబరు కిందకు తీసుకొచ్చి ఆ భూమి యజమానుల పేర్లు కలిపి రాస్తున్నారు. దీని వల్ల కొత్తగా ఇవ్వబోయే ఈ పాస్ పుస్తకాల్లో ఎంత మంది రైతుల భూమి హద్దులు ఫిక్స్ చేయలేదో వారందరి పేర్లు ఉంటాయి. ఈ సమస్య పరిష్కారం అయిన తరువాత మాత్రమే ఆ రైతుల హద్దులు నిర్ణయిస్తారు. అంతవరకు అందిరి పేర్లు అందరి పాస్ పుస్తకాల్లో ఉంటాయి. అంటే.. భూ హక్కు ఎవరిదో.. తేలటం లేదనేది నిర్వివాదంశం.

ఇటు తలపోటు.. అటు నోట్ల పండగ
ఈ రీ సర్వే వ్యవహారంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక వైపు అధికారులకు తలపోటు .. మరో వైపు సిబ్బందికి నోట్ల పండుగ వాతావరణం కనిపిస్తోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పాత రికార్డులు ఉన్నాయి. ఎప్పటి కప్పుడు సర్వే జరిగిన రికార్డులను ప్రభుత్వం ఇవ్వటం లేదు. సర్వే పూర్తయిన తరువాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ రికార్డుల్లో అప్డేట్ చేయాలి. ఈలోపు భూముల క్రయవిక్రయాలు సమస్యగా మారింది. సర్వే తరువాత ఓ వ్యక్తి తన భూమిని వేరే వారికి అమ్మాలనుకుంటే సబ్ రిజిస్ట్రార్ ఆన్ రికార్డుల్లోని సర్వే నెంబర్లకు, రెవెన్యూ రికార్డుల్లోని సర్వే నెంబర్లకు పొంతన కనపడటం లేదు. రీ సర్వే తరువాత ఆ పొలాలకు కొత్త నెంబర్లు అలాట్ అవుతున్నాయి. దీంతో ఆ పొలాల రిజిస్ట్రేషన్ లు జరగటం లేదు. దీంతో చాలా మంది రైతులు సచివాలయాలకు వచ్చి జరుగుతున్న ఇబ్బందులను అక్కడి సిబ్బందికి చెబుతున్నారు. ఈ సమస్యలు తాము పరిష్కరించేవి కాదని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే పరిష్కరించేందుకు వీలు ఉంటుందని చెబుతున్నారు. కానీ.. తక్షణమే దొడ్డి దారి రిజిస్ర్టేషన్ కు యజమానులు ఎగబడుతున్నారు. ఇంకేముందీ.. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ఆమ్యామ్యా సందడి ఉరలేస్తోందంటే.. కేవలం ఆరోపణ కాదు. ఆ తరువాత మరో భూ జగడం రోడ్డున పడటమూ మామూలే.. అని జనం అంటున్నారు.

తీరని జగడాలు.. తెరపైకి కొత్త పేచీలు
రీ సర్వే వల్ల సమస్యలు తీరతాయని, ప్రతి ఒక్క రైతుకు హద్దులు నిర్ణయించి సమస్యలు లేకుండా ప్రభుత్వం చేస్తుందని అందరూ భావించారు. కానీ అవేమీ జరగటం లేదు. సమస్యలు సమస్యలుగానే ఉంటున్నాయి. వివాదమున్న భూముల సర్వే నెంబర్లు అన్నీ కలిపి సుమారు పది మంది రైతుల పేర్లు ఒకే పాస్ పుస్తకంలో నమోదు చేసి ప్రతి రైతుకూ ఇస్తుండటంతో వారి మధ్య ఉన్న వివాదాలు అలాగే ఉంటున్నాయి. ముందుగా రెవెన్యూ కోర్టులు, ఆ తరువాత న్యాయస్థానాల్లో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక్కో మండలంలో వేల మంది సమస్యలు అలాగే ఉంటున్నాయి. సమస్యలు పరిష్కారం ఎప్పటికి జరుగుతుందో… విడి విడిగా పాస్ పస్తకాలు ఎప్పటికి వస్తాయోనని రైతులు ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *