ప్రధానిని చేయడమే లక్ష్యంగా సాగుతున్నాం
• పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం
• రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నా
• ఖర్చులు నియంత్రిస్తున్నా
• సంపద సృష్టికి కృషి చేస్తున్నా
• ఆంధ్రప్రభతో డిప్యూటీ సీఎం భట్టి ముఖాముఖి
డాక్టర్ బాబాసా హెబ్ బీఆర్.అంబేద్కర్ స్ఫూర్తి.. ఆశయసాధనలో భాగంగా రాజ్యాంగ ఫలాలను ప్రజలందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని.. ప్రాంతాలు.. మతాల వారీగా సాగిస్తున్న విధ్వంసాన్ని అరికట్టి.. లౌకికతత్వాన్ని పెంపొందించాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి తీరాలని.. అదొక్కటే 140కోట్ల ప్రజలను సంరక్షించే ఏకైక మార్గమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు… రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చిట్టచివరి కోరికను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు… గతంలో పతనావస్థకు చేరిన ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన మన్మోహన్.. రోశయ్యలు ఎలా అయితే గాడిలో పెట్టారో.. అదే మాదిరిగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నానని భట్టి తెలిపారు… ఖర్చుల నియంత్రణ.. రాష్ట్రంలో సంపద సృష్టికి కృషి చేస్తున్నామన్నారు… ప్రజాభవన్లో ఆంధ్రప్రభ ప్రతినిధితో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖాముఖి.
ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్ ఇన్చార్జి:
డా.బీఆర్. అంబేద్కర్ కలలుగన్న రాజ్యాంగం పరి పూర్ణంగా అమలు జరగాలన్నా, భారతదేశ సమగ్రా భివృద్ధి, అభ్యున్నతి జరగాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, విద్వేషం, విధ్వంసాలు లేని వ్యవస్థ నిర్మాణం కావాలంటే కాలనాగులాంటి విచ్చిన్నకర బీజేపీని గద్దెదింపడమే ఏకై క మార్గమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
బడుగులు, బలహీ నవర్గాలతో పాటు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమేనని, స్వతంత్ర్య భారతావని చరిత్రలో ఇప్పటివరకు జరిగిన అన్ని మంచి పనులు, అభివృద్ధి, సంక్షేమాల అమలు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగాయన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం రాహుల్గాంధీని ప్రధానిని చేయాలని, డా.వైఎస్. రాజశేఖర్ రెడ్డి చివరి సీఎల్పీ సమావేశంలో చిట్టచివరిగా కోరినట్లు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న ఆకాంక్షను నెరవేర్చేందుకు క్రమశిక్షణ గలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా తాను నిరంతరం కృషి చేస్తానన్నారు.
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా బూత్ లెవల్ నుంచి అదే ఆశయంతో పనిచేసి, పదవులు, అధికారం కోసం ఎదురవుతున్న విబేధాలను పక్కనపెట్టి, వైఎస్సార్ చివరి ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. కష్టపడే వారికి పదవులను ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, అట్టడుగు వర్గాల వారిని గుర్తించి, అగ్రస్థానంలో కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని భట్టి విక్రమార్క గుర్తు చేశారు.
ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డా.వైఎస్సార్ను అభిమానించే ప్రతి కార్యకర్త, రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యంగా పని చేయా లని సూచించారు. పదవులున్నా, లేకున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముందుకు సాగుతామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
హామీల అమలుకు కృషి చేస్తాం
ఆరు గ్యారెంటీల అమలు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆయా గ్యారెంటీలు అమలు జరగడం లేదన్న విపక్షాల ఆరోపణలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆంధ్రప్రభ ప్రశ్నించగా, రాజకీయ లబ్ధికోసం, అధికార దాహంతో చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, వారి ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం అసలే లేదని స్పష్టం చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీ అమలు బాధ్యత కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని, పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య, ప్రజలకిచ్చిన హామీల అమలు బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలు భట్టి విక్రమార్క సొంత ఎజెండా కాదని, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షమని, ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఇచ్చిన అభయ హస్తమని అభివర్ణించారు. వాటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామని, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మడమతిప్పదని, తమకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉందని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ గుడ్డిగా పోదని, ప్రజల అభీష్టు, ఆకాంక్షలను నెరవేర్చడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు, సంపద సృష్టించడం, ఆ సంపద ఫలాలను ప్రజలకు అందించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
చివరిగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో అప్పులకుప్పగా మారిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనుక్షణం తపిస్తున్నామని, ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
కుల సమీకరణాలు, ప్రాంతీయ విబేధాలు సృష్టించి లబ్ధిపొందాలని చూడటం ఎప్పటికీ కరెక్ట్ కాదని, ఆయా విధానాలకు తాను వ్యతిరేకమన్నారు. తమది జాతీయ పార్టీ అని, తమ విధానం జాతీయవాదమన్నారు. అందువల్లే కొన్ని విమర్శలకు సమా ధానం చెప్పడం లేదన్నారు. విమర్శించే వారికి కుర్చి కావాలని, మాకు ప్రజలు కావాలని, ప్రజల కోసం శ్రమించే క్రమంలో కొందరి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
వారికి కుర్చీ కావాలి.. మాకు ప్రజలు కావాలి
పదవీ వ్యామోహంతోనో, అధికారం కోసమో రాజకీయాలు చేసే నేపథ్యం తనది కాదని, అవగాహనా రాహిత్యం, కుర్చీ కుమ్ము లాటల వేటలో ఆరోపణలు గుప్పించే విమర్శకుల అభిప్రా యాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, వారిది ఆక్రోశం మాత్రమేనని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీకి చారిత్రక నేపథ్యం ఉందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే సత్తా కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉందని ఆయన తెలిపారు. ఏళ్ల తరబడి తమ పార్టీ ఏలుబడిలో ఇందు కు సంబంధించిన అనేక విషయాలు ప్రజలకు తెలుసని ఆయన వివరించారు. తన పాదయాత్రలో అడుగడుగునా ప్రజల స్పందనతో అనుభూతి చెందానని, కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకొన్న ప్రజల ఆవేదనలను కళ్లతో చూశామని, వారికి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నామని, ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుం టున్నామన్నారు.
ఈ క్రమంలో ప్రజలకు మేలు జరగాలంటే రాహుల్గాంధీని ప్రధాని చేయడమే కర్తవ్యంగా ముందుకు సాగాలి. నాటి మన్మోహన్ సింగ్, రోశయ్యల స్ఫూర్తితో ఆర్థిక శాఖను ముందుకు నడిపిస్తున్నా, చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు, సంపద సృష్టించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. సంపదను పంచి అన్నివర్గాల ప్రజలకు మేలు చేయాలన్నదే నా ఆశయం. అందుకోసం నిరంతరాయంగా శ్రమించి, ఆర్థిక మంత్రిగానూ నా మార్క్ చాటాలన్నదే లక్ష్యం. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం, అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు చేర్చడం, తద్వారా మళ్లీ ఎన్నికలకు ప్రజల ముందుకు వెళ్లాలన్న సంకల్పంతో ముందుకు సాగుతు న్నామంటూ ఆయన ముగించారు.

