Exclusive – మార్పు కావాలి.. ఇది చాలదు! స్పీడ్ పెరగాలంటున్న జనం
మిషన్ మోడ్‌లో పనిచేస్తున్న సీఎం రేవంత్
లాంగ్ టర్మ్ గోల్స్‌తో దూసుకెళ్తున్న ముఖ్యమంత్రి
చంద్రబాబు, వైఎస్సార్ తరహాలో సరికొత్త ఆలోచనలు
స్కిల్ వర్సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ వర్సిటీ, స్పోర్ట్స్ హబ్‌కు ప్రాధాన్యం
కొత్త పాలసీలను ఆవిష్కరిస్తున్న రేవంత్ సర్కారు
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు రుణమాఫీ
ప్రతి పథకంలోనూ మహిళలకు అత్యంత ప్రాధాన్యం
ఎక్జిక్యూట్ చేయడంలో కనిపిస్తున్న లోపం
ఫీల్‌గుడ్ తీసుకురాలేకపోతున్న అధికారులు, సిబ్బంది
ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టు రాని ఫీడ్ బ్యాక్
ఇంకా గత ప్రభుత్వంపైనే సీఎం, మంత్రుల ఎదురుదాడి
ఏడాది గడిచినా ఇదేం తీరు అంటూ సామాన్యలు పెదవి విరుపు
పాలసీలు, పాలనపై ఫోకస్ పెట్టాలంటున్న అనలిస్టులు
ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్:
మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇక మీదట అసలైన సవాళ్లు ఎదురుకాబోతున్నట్టు తెలుస్తోంది. ఏడాది గడిచినా గత ప్రభుత్వం వైఫల్యాలను ప్రచారం చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారనే అపవాదు జనాల నుంచి వినిపిస్తోంది. అయితే ప్రజలు కోరుకున్న మార్పు ఇంకా కనిపించకపోవడంతో కొన్ని సెక్షన్లు ఆందోళన చెందుతున్నాయి. కాగా, రేవంత్ సర్కారు తొలి ఏడాది పాలనలో వ్యవస్థలను గాడిన పెట్టడానికే సరిపోయింది. ఇందులోనే సీఎం రేవంత్, మంత్రి వర్గ సహచరులంతా ప్రధాన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టారు. అందులో మెజార్టీ హామీలను అమలు చేయడానికి పెద్ద ఎత్తున కృషి జరిగింది. అయితే.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ఫోకస్ అంతా కేవలం సంక్షేమంపైనే కాదు.. అభివృద్ధిపైనా పెట్టాల్సిన పరిస్థితి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. అంతేకాకుండా పాలనలో తమదైన మార్క్ చూపాలంటే మరిన్ని కొత్త పాలసీలను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని అనలిస్టులు అంటున్నారు.
నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాలంటే..
అటు ఆదాయానికి మించిన ఖర్చు ప్రతి నెలా ఉంటోంది.. అలాగని జనంపై పన్నుల భారం వేసే పరిస్థితి లేదు. పకడ్బందీగా వ్యవస్థలు సాగుతున్నాయి. అయితే.. సీఎం ఒక్కరితోనే ఇవన్నీ పూర్తికావు. అనుకున్నవన్నీ సజావుగా సాగాలంటే గ్రౌండ్లో పంచాయతీ సెక్రెటరీ దగ్గర్నుంచి సెక్రెటేరియట్‌లో చీఫ్ సెక్రెటరీ దాకా పాజిటివ్ వేలో పని చేయాల్సి ఉంటుంది. అందరూ కదలాల్సిందే. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ అయితేనే నెక్ట్ ఫేజ్ మొదలయ్యే చాన్స్ ఉంటుందని అనలిస్టులు చెబుతున్నారు.
రేవంత్ ముందు లాంగ్ టర్మ్ గోల్స్ ..
సీఎం రేవంత్ రెడ్డి లాంగ్ టర్మ్ గోల్స్ తో పని చేస్తున్నట్టు తెలుస్తోంది. లాంగ్ టర్మ్ గోల్స్ సక్సెస్ అయితే.. అవే శాశ్వతంగా నిలిచిపోతాయని భావిస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో వైఎస్సార్, చంద్రబాబు వంటి వారు దూరదృష్టితో చేసిన అభివృద్ధితో భాగ్యనగరం దశ తిరిగిపోయింది. సో ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా ఫ్యూచర్లో ఎఫెక్ట్ చూపే వాటిపైనే ఫోకస్డ్గా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీటిలో స్కిల్ వర్సిటీ, అన్ని హంగులతో నెట్ జీరోగా వస్తున్న ఫ్యూచర్ సిటీ, ఏఐ వర్సిటీ, స్పోర్ట్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యం వంటివి చాలా ఉన్నాయి. అయితే అవి భవిష్యత్‌లో చాలా ఎకానమీ జెనరేట్ చేస్తాయి. కానీ, ఇప్పటికిప్పుడు వీటితో పెద్దగా ఎఫెక్ట్ ఉండదనేది పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
అనుకున్నంత స్థాయిలో ఫీడ్ బ్యాక్ రావట్లేదా?
పేదల విషయంలో సంక్షేమం ఎప్పటికప్పుడు అందాల్సిందే. పాజిటివ్ కోణాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. వస్తున్న డబ్బుల్ని ఆరు గ్యారెంటీలు, సంక్షేమం, అభివృద్ధి కోసం కేటాయించేందుకు సీఎం స్థాయిలో చాలానే శ్రమించాల్సి వస్తోంది. అయితే.. చేస్తున్న పనులను జనంలోకి తీసుకెళ్లాలన్నా.. వాటిని సక్రమంగా ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఉద్యోగులే కీలకం. స్వయంగా సీఎం రేవంత్ రెగ్యులర్ గా కమాండ్ కంట్రోల్ సెంటర్లో శాఖలవారీగా రివ్యూలు చేస్తున్నారు. ఆయా శాఖల పనితీరుకు తగ్గట్టు ఆదేశాలిస్తున్నారు. మరి వాటిని గ్రౌండింగ్ చేయాల్సింది ఆఫీసర్లే. కానీ, ప్రజల నుంచి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదని తెలుస్తోంది. సో ఇంత చేస్తున్నా ఫీడ్ బ్యాక్ అనుకున్నంత స్థాయిలో రాకపోవడానికి కారణాలు ఏంటనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఎంతసేపూ గత ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఉంటే.. అసలు పని కావడం లేదన్నది కూడా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఫైనల్‌గా ఎగ్జిక్యూషన్లో లోపం ఉన్నట్లు సీఎం రేవంత్, మంత్రి వర్గ సహచరలు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది.
ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఆఫీసర్లే
తాజా ప్రభుత్వం కొన్ని ప్రయారిటీస్ పెట్టుకున్న మాట వాస్తవం.. అయితే.. కొత్త తరహాలో ప్రజలకు చేరువ కావడానికి పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అమలు చేస్తోంది. చాలెంజింగ్ గా తీసుకుని రుణమాఫీ చేసింది. అయినా సరే అనుకున్న స్థాయిలో రైతు వర్గాల నుంచి సానుకూల రెస్పాన్స్ రాలేదని సమాచారం. దీనికి అధికారులు నిర్లిప్తంగా ఉంటే ఎలా అన్నదే ఇక్కడ క్వశ్చన్ పాయింట్. లెజిస్లేచర్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఆఫీసర్లే. దీనికి సమగ్ర కుటుంబ సర్వేనే ఉదాహరణగా చూస్తే… సర్వే ఎప్పుడో పూర్తి అయినా దానికి సంబంధించిన కంప్యూటరీకరణ మాత్రం లేట్ అవుతోంది. అనుకున్నంత వేగంగా డేటా అప్లోడ్ చేయలేకపోయారు. దీనికి సంబంధించి వచ్చిన అప్లికేషన్లను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసే వారు లేకుండా పోయిన పరిస్థితి నెలకొంది.
పాత డేటాతోనే రేషన్ కార్డు లిస్ట్ వచ్చిందా?
మరో ఎగ్జాంపుల్ని కూడా పరిశీలకులు ముందుకు తెస్తున్నారు. తాజాగా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కార్డుల జాబితాలో పేర్లు వచ్చిన వారిలో బీఆర్ఎస్ హయాంలో అప్లై చేసుకుని ఎదురుచూసిన వారి డేటానే ఉందని తెలుస్తోంది. ఆ డేటాను తీసుకునే అధికారులు పేర్లు పొందుపరిచినట్టు సమాచారం. సో డేటా సేకరణలో, అర్హులను గుర్తించడంలో మొక్కుబడిగా వ్యవహారం సాగుతోందనడానికి ఇదే ఉదాహరణ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
శాఖల మధ్య సమన్వయ లోపం ఉందా?
ప్రభుత్వం ఎంత పని చేసినా అధికారుల పని తీరు సరిగా లేకుంటే చెడ్డపేరు ప్రభుత్వానికే వస్తుంది. నిధులిచ్చుకుంటూ వెళ్తే లాభం లేదు. అవి అసలైన పేదలకు చేరాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా చర్చకు వస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలేమి కనిపిస్తోందనేది సరికొత్త వాదన. గ్రామాల్లో పంచాయతీ సెక్రెటరీలు వర్సెస్ రెవెన్యూ ఉద్యోగులు అన్నట్లుగా పరిస్థితి మారింది. పని మాది పేరు మాత్రం రెవెన్యూదా? అని చాలా మంది సెక్రెటరీలు నిష్టూరమాడుతున్నారు. ఇక గ్రామ పాలనలో భాగంగా వీఆర్వోలు, వీఏవోలు, సర్వేయర్లు వస్తారని చెప్పినా అవి వర్కవుట్ కాలేదు. దీంతో ఇటీవలే సీఎం రేవంత్ కూడా ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాల ఉచ్చులో పడితే చివరకు నష్టపోయేది ఉద్యోగులే అంటూ హెచ్చరించారు.
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.9%
తెలంగాణ స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి 2036 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంచనా వేసింది. ప్రస్తుతం జీఎస్డీపీ 15 లక్షల కోట్లుగా ఉందని.. వచ్చే 12 ఏళ్లలో అది భారీగా వృద్ధి చెందుతుందని తాజా రిపోర్టుల్లో తేల్చింది. దేశ జీడీపీలో ప్రస్తుతం తెలంగాణ వాటా 4.9% ఉండగా.. అది 2032 నాటికి 7.73 శాతానికి, 2036 నాటికి 9.3 శాతానికి చేరుకుంటుంది. 140 కోట్ల దేశ జనాభాలో కేవలం 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ ప్రోగ్రెస్ ఎంతో ఉంది. తలసరి ఆదాయం జాతీయ సగటుతో పోలిస్తే రెండింతలకు చేరువైంది.
ప్రతీ నెల ప్రభుత్వ ఆదాయం రూ.18,500 కోట్లు
ప్రతీ నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 18,500 కోట్లు. ఇది సరిపోదు. అన్నీ సక్రమంగా నిర్వహించాలంటే కనీసం నెలకు 30 వేల కోట్లు అవసరం కనిపిస్తోంది. సర్కారుకు వచ్చే ఆదాయంలో ప్రతినెలా 6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు వాడుతుండగా, మరో 6,500 కోట్లు అప్పులు చెల్లిస్తున్నారు. మిగిలిన 5,500 కోట్లలోనే సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ లెక్కన కనీస అవసరాల వారీగా చూసినా.. ప్రతీ నెలా 22,500 కోట్లు కావాలి.
జీతాలకు 6, 500 కోట్లు, అప్పులకు 6,500 కోట్లు
వస్తున్న ఆదాయంతో పోలిస్తే ఇది 4 వేల కోట్లు తక్కువగా ఉంది. సో ఆదాయం పెంచుకుందాం అని పై నుంచి ఆదేశాలు వస్తే సరిపోదు. ప్రభుత్వ సిబ్బంది కూడా సరిగా వర్కవుట్ చేయాలి. కొత్త ఐడియాలు తీసుకురావాలి. ఆదాయం పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఖజానా బాగుపడుతుంది.
కొత్త పాలసీలను ఆవిష్కరిస్తున్న ప్రభుత్వం
నిజానికి దావోస్ పర్యటనలో పెట్టుబడులు అంత ఈజీగా రాలేదు. చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికే తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025ని ఆవిష్కరించారు. విద్యుత్ కేబుల్స్‌తో పాటు ఇతరత్రా వివిధ రకాల కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా వివిధ ప్రత్యమ్నాయాలు పరిశీలిస్తున్నారు. ఫిబ్రవరి 10లోగా టూరిజం పాలసీ రెడీ చేయాలని ఆదేశించారు. ఈవీ పాలసీ తెచ్చారు. మెరుగైన పారిశ్రామిక పాలసీ అమలు చేస్తున్నారు. గ్రామీణ రోడ్లకు మహర్దశ కల్పిస్తున్నారు. ఒక్కటేమి ఎన్నెన్నో సమీక్షలు చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో లక్ష్యాలతో సీఎం రేవంత్ వేగవంతంగా ముందుకు వెళ్తున్నారు.