రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టుల ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టుల ఏర్పాటు

1730 పోస్టుల మంజూరు
నంద్యాల జిల్లాలో.. 21 కొత్త అదనపు కోర్టుల ఏర్పాటు కళకళ
జిల్లా జడ్జి క్యాడర్ కోర్టులు..సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్ కోర్టులు ఏర్పాటు
శ్రీశైలంలో కొత్త జూనియర్ సివిల్ జడ్జి కం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రారంభం
మరో 16 జూనియర్ సివిల్ జడ్జి కం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులు
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం
రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కొత్త అదనపు కోర్టుల ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర పడిన నేపథ్యంలో నంద్యాల జిల్లాలో ఏకంగా 21 కొత్త మరియు అదనపు కోర్టులు ఏర్పాటు కానున్నాయని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఫరూక్ శుక్రవారం పేర్కొన్నారు. నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఎన్ఎండి ఫరూక్ స్థానిక జిల్లాల్లో కొత్త కోర్టు ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో కొత్త కోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో న్యాయవాద వర్గాల్లో హర్షాతిరేఖాలు వ్యక్తం అవుతున్నాయి.

పెండింగ్ కేసుల పరిష్కారం కోసం

రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పెండింగ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని , వాటి పరిష్కారం కోసం, సత్వర న్యాయం కోసం కొత్త కోర్టులు, అదనపు కోర్టు లను ఏర్పాటు చేసేందుకు న్యాయశాఖ ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా పెండింగ్ కేసుల సంఖ్య ఆధారంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో హైకోర్టు రిజిస్టార్ పరిపాలన విభాగం ప్రతిపాదించిన 96 కొత్త అదనపు కోర్టులు ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. కొత్త అదనపు కోర్టు ల్లో విధి నిర్వహణ కోసం 1730 పోస్టులు సృష్టించుటకు కూడా ఆమోద ముద్ర వేయడం జరిగిందని తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో 21 కోర్టుల ఏర్పాటు

ఉమ్మడి నంద్యాల జిల్లా లోని వివిధ నియోజకవర్గాల పరిధిలో 21 కొత్త అదనపు కోర్టు లు ఏర్పాటు కానున్నాయన్నారు. ఇందులో రెండు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులు, రెండు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు,17 జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 12 జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులలో భాగంగా ఉమ్మడి జిల్లాలో కర్నూలులో 8వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు, నంద్యాలలో 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన 25 సీనియర్ సివిల్ జడ్జి కోర్టులలో భాగంగా, ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదోనిలో ఒకటవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఎమ్మిగనూరులో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయనున్నారు.

జూనియర్ సివిల్ జడ్జి కం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుల ఏర్పాటు లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 59 కోర్టుల్లో, ఉమ్మడి కర్నూలు జిల్లా కు 17 కోర్టులు మంజూరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో ఆదోనిలో మూడవ అదనపు సివిల్ జడ్జి కం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, ఆళ్లగడ్డలో ఒకటవ, ఆలూరు లో ఒకటవ, ఆత్మకూరులో ఒకటవ, బనగానపల్లెలో ఒకటవ, డోన్ లో రెండవ, కర్నూలులో 5 వ 6 వ ,7 వ ,8 వ అదనపు కోర్టులు, నందికొట్కూరులో ఒకటవ కోర్ట్ నంద్యాలలో 2వ 3 వ 4 వ అదనపు సివిల్ జడ్జి కోర్టులు, పత్తికొండలో ఒకటవ, ఎమ్మిగనూరులో ఒకటవ అదనపు సివిల్ జడ్జి కోర్టులు ఏర్పాటు కానున్నాయన్నారు. కాగా శ్రీశైలంలో కొత్తగా జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేస్తున్నాట్లు తెలిపారు.

పెండింగ్ కేసుల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు

భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రకారం ఏ కేసు కూడా ఐదు సంవత్సరాలకు మించి పెండింగ్ లో ఉండరాదు.రాష్ట్రంలో పెండింగ్ కేసుల సంఖ్య 2019 వ సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీ నాటికి 5,38,020 ఉండగా, ఈ సంఖ్య 2025 జనవరి ఒకటో తేదీ నాటికి 8,93,993 కు చేరిందన్నారు . కానీ కోర్టుల సంఖ్య మాత్రం ఈ కాలంలో 636 నుండి 660 కి మాత్రమే పెరిగిందన్నారు.దీంతో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది.ఆర్థిక శాఖ 2026-27 కు గాను 100 కోర్టులు ఏర్పాటు చేయుటకు సమ్మతి తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జ్యుడీషియల్ జిల్లాలతో పాటు,రాబోయే కొత్త జ్యుడీషియల్ జిల్లాలలో 172 క్రొత్త మరియు అదనపు కోర్టులు ఏర్పాటు చేసేందుకు హైకోర్టు రిజిష్ట్రార్ పరిపాలన వారు ప్రతిపాదన పంపించారు.

ఇందులో 96 కోర్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 21 కొత్త కోర్టులు మంజూరు కావడంతో పెండింగ్ కేసుల పరిష్కారంతోపాటు, సత్వర న్యాయ సేవలు సులభతరం గా అందనున్నాయి.రాష్ట్రంలో 96 కోర్టులు, 1730 పోస్టులు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రివర్గ సహచరులకు,హై కోర్టుకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply