ENG vs AFG | ఆఫ్ఘన్ చేతిలో ఇంగ్లండ్ ఖేల్ ఖతం !

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆఫ్ఘనిస్థాన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు (బుధవారం) ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్.. ఆ జ‌ట్టు చ‌రిత్ర‌లోనే (ఐసీసీ ఈవెంట్ల‌లో) అత్య‌ధిక పరుగులు న‌మోదు చేసింది… ఆపై భారీ టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన‌ ఇంగ్లండ్ ను అద్భుతంగా క‌ట్ట‌డి చేసింది. మొత్తానికి ఆల్ రౌండ్ ప్రదర్శనతో అద‌ర‌గొట్టిన‌ ఆఫ్ఘనిస్థాన్ ఈ మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కాగా, ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 326 పరుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన‌ ఇంగ్లండ్… 317 పరుగులకే ఆలౌటైంది. ఈ భారీ ఛేద‌న‌లో.. బెన్ డకెట్ (38), హ్యారీ బ్రూక్ (25), కెప్టెన్ జోస్ బట్లర్ (38) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇక‌ జోరూట్ అసమాన పోరాటం (120)తో జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించాడు. అయితే 46వ ఓవర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వారు కూడా కొన్ని పరుగులకే వెనుదిరగడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. ఈ టోర్నీ నుంచి ఇంగ్లండ్ నిష్క్రమించింది.

ఆఫ్ఘాన్ బౌల‌ర్ల‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 వెకెట్ల‌తో చెల‌రేగాడు. మహమ్మద్ నబీ రెండు వికెట్లు తీయ‌గా… ఫజల్హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్, గుల్బాదిన్ నాయబ్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు.

అంతకుముందు అఫ్గాన్ బ్యాటర్లలో… ఓపెనర్ గా బరిలోకి దిగిన ఇబ్రహీం సెంచరీతో చెలరేగాడు. 146 బంతుల్లో ఆరు సిక్సర్లు 12 ఫోర్లతో 177 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదే వేదికపై ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ (165) ఆస్ట్రేలియాపై నమోదు చేసిన రికార్డు స్కోరును అధిగమించి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఇబ్రహీం రికార్డు సృష్టించాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన మొదటి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్‌గా జద్రాన్ నిలిచాడు.

37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును అహ్మదుల్లా షాహిదితాతో కలిసి ఇబ్రహీం ఆదుకున్నాడు. ఈ ఇద్ద‌రు నాలుగో వికెట్ కు 103 ప‌రుగులు జోడించారు. ఆ త‌ర్వాత న‌బీ (24 బంతుల్లో 40) , ఓమ‌ర్జాయ్ (31 బంతుల్లో 41) తో క‌ల‌సి స్కోర్ ను ప‌రుగెత్తించాడు. దీంతో అప్ఘ‌నిస్తాన్ నిర్ధారిత 50 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 325 పరుగులు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *