England Cricket | తాగి తంద‌నాలు..!

England Cricket | తాగి తంద‌నాలు..!

  • ఇంగ్లాండ్ జట్టుపై మద్యం ఆరోపణలు
  • విచారణకు సిద్ధమైన ఈసీబీ

England Cricket | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : ఇంగ్లండ్ క్రికెట్(England Cricket) జ‌ట్టుపై మూలిగే న‌క్క మీద తాటిపండు ప‌డ్డ‌ట్ట‌య్యింది. నిరాశాజనక ప్రదర్శనతో యాషెస్ సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తీవ్ర విమర్శల‌ను ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియాలో వరుసగా నాలుగోసారి యాషెస్ సిరీస్ కోల్పోయింది. ఇదంతా ఒక్కెత్త‌యితే ఆటగాళ్ల ప్రవర్తనపై అభిమానులు సీరియ‌స్‌గా ఉన్నారు.

ఆసీస్‌‌ టూర్‌‌‌‌లో ఆట‌పై దృష్టి పెట్ట‌కుండా కెప్టెన్ బెన్‌‌ స్టోక్స్(Ben Stokes) సహా ఇంగ్లిష్ టీమ్ క్రికెటర్లలో చాలా మంది మ‌ద్యం తాగుతూ ఎంజాయ్ చేపిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. రెండో, మూడో టెస్టుకు మధ్య లభించిన 9 రోజుల విరామంలో క్రికెటర్లు మద్యం మత్తులో మునిగిపోయారంటూ ఓ వార్తా కథనం ప్రచురిత‌మైంది.

బెన్ డకెట్ మత్తులో ఉన్నట్లు క‌నిపించిన‌ ఓ వీడియో సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతోంది. అయితే, ఆ వీడియో ఆస్ట్రేలియాలోనే చిత్రీకరించబడిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. దాంతో జట్టు అంతా పాల్గొనాల్సిన జిమ్‌‌ సెషన్‌‌కు కేవలం ముగ్గురు ఆటగాళ్లే హాజరయ్యారని పేర్కొంది.

ఈ పరిణామాలపై ఇంగ్లండ్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఆట‌గాళ్ల తీరుపై విచారణకు ఆదేశించాడు. ప్లేయర్లు ఇలా విచ్చలవిడిగా ప్రవర్తించడం ఆమోదయోగ్యం కాదన్నాడు. ఈ వార్తలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు.

ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. 2011లో ఆండ్రూ స్ట్రాస్(Andrew Strauss) నాయకత్వంలో చివరిసారి యాషెస్ గెలిచిన ఇంగ్లాండ్, ఆ తర్వాత అక్కడ 18 టెస్టులు ఆడగా 16 ఓటములు, 2 డ్రాల‌తో స‌రిపెట్టుకుంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న యాషెస్‌ సిరీస్‌(Ashes series)లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు కనీసం పరువు నిలబెట్టుకోవాలన్నా స్టోక్స్ సేన గట్టిగా పోరాడాల్సిందే. లేకపోతే నాలుగోసారి 5-0 వైట్‌వాష్ ముప్పు తప్పదు.

Leave a Reply