Encounter | రాహుల్ గాంధీ మతం, అభిమతం కుల గణన – మంత్రి సీతక్క

బీసీల‌కు న్యాయం చేయాల‌నేదే ఆయ‌న ల‌క్ష్యం
లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్న బీజేపీ
కావాల‌నే టార్గెట్ చేస్తున్నారు
పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌
కేంద్ర మంత్రి బండి వ్యాఖ్య‌ల‌పై మండిపాటు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మండిప‌డ్డారు. సచివాలయంలో ఆమె నేడు మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ మతం, అభిమతం కుల గణన అని అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే రాహుల్ గాంధీ అభిమతం అని తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని కులగణన కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా బీసీ కులగ‌ణ‌న‌ కోసం పట్టుబడుతున్నారని గుర్తుచేశారు.

కుల‌గ‌ణ‌న ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే బీజేపీ నేత టార్గెట్‌
కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్ గాంధీని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నార‌ని సీత‌క్క అన్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన ఆయన్ను ఎవరేం చేయ‌లేర‌ని, రాహుల్ విజన్ ఉన్న నాయకుడ‌న్నారు. 30 ఏళ్లుగా ఎలాంటి మంత్రి పదవుల్లో లేకుండా దేశం కోసం పనిచేస్తున్నార‌న్నారు. అందుకే గ్రామ స్థాయి నుంచి ప్రధాని వరకు.. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. విద్వేష, విధ్వంసమే బీజేపీ విధాన‌మ‌న్నారు. కాంగ్రెస్ శాంతి సమానత్వం అభివృద్ధి కావాలో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు.

పేద‌ల‌కు బీజేపీ చేసిందేమిటి?
కులగణన అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే రాహుల్ గాంధీ మతంపై చర్చ చేస్తున్నార‌ని సీత‌క్క మండిప‌డ్డారు. పదేళ్లుగా దేశం కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం బీజేపీ చేసింది ఏమీ లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. విభజన రాజకీయాలతో పదవులు పొందటం బీజేపీ నేతల నైజమ‌ని, రాహుల్ గాంధీ పదవుల కోసం పాకులాడే మనిషి కాద‌ని గుర్తు చేశారు. త్యాగాల వారసత్వంతో సమాజ అభివృద్ధి కోసం, సమసమాజ లక్ష్యం కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని సీతక్క అన్నారు.

అదానీ ఆస్తుల పెంచ‌డం కోసం రాహుల్ ప‌నిచేయ‌డం లేదు
అదానీ ఆస్తుల పెంచ‌డం కోసం రాహుల్ గాంధీ పనిచేయటం లేద‌ని సీత‌క్క అన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అంతరాలు లేని సమాజమే రాహుల్ గాంధీ లక్ష్యమ‌న్నారు. బీజేపీ విద్వేష రాజకీయాలతో సమాజం వెనుకబాటుకు లోనవుతుంద‌ని ఆరోపించారు. తొలి ప్రధాని నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు చేపట్టిన సంస్కరణలే ఈ రోజు దేశాన్ని నిలబెడుతున్నాయ‌ని గుర్తు చేశారు. ప్రజలంతా బీజేపీ నైజాన్ని గ్రహించాలని సీతక్క పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *