తిరుపతి: ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానికి (Tirumala Tirupati Devasthanam) నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల (Tirumala) కొండకు చేరుకుని.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. తిరుమల ఘాట్ రోడ్డులో, అలిపిరి (Alipiri) మెట్టు మార్గంలో ఏనుగుల (Elephants) సంచారం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ తరుణంలో తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల సంచారం తీవ్ర కలకలం రేపింది. పంట పొలాలను గజరాజులు ధ్వంసం చేశాయి.

చంద్రగిరి మండలం (Chandragiri Mandal) శ్రీనివాస మంగాపురం నుండి తిరుమలకు వెళ్ళు శ్రీవారిమెట్టు మార్గంలో అర్ధరాత్రి సమయంలో ఏనుగులు కలకలం సృష్టించాయి. పంపుహౌస్ దగ్గర రాత్రి 15-17 ఏనుగుల గుంపును డ్రోన్ కెమెరాతో గుర్తించారు. డ్రోన్ కెమెరా సమీపంలో గజరాజులు పంట పొలాలు ధ్వంసం చేశాయి. శ్రీ వినాయకస్వామి చెక్ పాయింట్ దగ్గర అధికారులు గంటపాటు భక్తులను నిలిపివేశారు. అటవీ, టీటీడీ ఫారెస్ట్, విజిలెన్స్ అధికారుల సమన్వయంతో ఏనుగులను అడవిలోకి తరలించే ప్రయత్నాలు చేశారు.

మెట్టుమార్గంలోని పంప్ హౌస్ వద్ద ఏనుగుల గుంపును డ్రోన్ కెమెరాతో అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో చెట్టు కొమ్మలు తగలడంతో డ్రోన్ కెమెరా కింద పడిపోవడంతో అవి ఏ వైపుగా వెళుతున్నాయో గుర్తించలేకపోయారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న మూడు విభాగాల అధికారులు శ్రీ వినాయక స్వామి చెక్ పాయింట్ వద్ద భక్తులను సుమారు గంటపాటు నిలిపివేశారు. రాష్ట్ర అటవీ, టీటీడీ విజిలెన్స్ అధికారులు సమన్వయంతో గజరాజులను అడవిలోకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఏనుగుల సంచారంతో తిరుమల భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల సంచారం నేపథ్యంలో శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను గుంపులుగా వదులుతున్నారు. ఏనుగులు సంచరిస్తుండటంతో భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు.

Leave a Reply