రిజ‌ర్వేష‌న్ల బిల్లు ఆమోదం పొందాక ఎన్నిక‌లు పెట్టాలి

రిజ‌ర్వేష‌న్ల బిల్లు ఆమోదం పొందాక ఎన్నిక‌లు పెట్టాలి

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ (Congress) పార్టీకి చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి చీఫ్, ఎమ్మెల్సీ కల్వకుంట కవిత (Kalvakuntla Kavitha) ఆరోపించారు. ఇవాళ బంజారా‌హిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రెండు నెలలు ఆగి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాక స్థానిక ఎన్నికలు పెడితే నష్టమేంటని ప్రశ్నించారు. తమ పోరాటం అంతా బీసీ రిజర్వేషన్లపైనేనని అన్నారు. బీసీల అంశంపై బీఆర్ఎస్ సీరియస్‌గా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

తనకు బీఆర్ఎస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని క‌విత‌ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ (Etala Rajender) చేసిన వ్యాఖ్యలు స‌రికాద‌న్నారు. స్థానిక ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకూడదని ఈటల అంటున్నారని.. మహారాష్ట్రలో ఎన్నికలు రద్దు అయినట్లుగానే.. రాష్ట్రంలో కూడా రద్దవుతాయని చెబుతున్నారని తెలిపారు. కోర్టులను తప్పుదోవ పట్టించేలా ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు.

తెలంగాణ(Telangana) జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ సంబురాలకు చింతమడక నుంచి లండన్ వరకు మహిళలు బ్రహ్మరథం పట్టారని కవిత అన్నారు. ఎన్నడూ జై తెలంగాణ అనని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం ఆహ్వానించదగిన విషయమని అన్నారు. గిన్నిస్ బుక్ రికార్డు(Guinness Book of Records) కోసం ప్రభుత్వం బతుకమ్మ సంబురాలు చేసింద‌ని, తెలంగాణ అస్తిత్వాన్ని చాటేందకు బతుకమ్మ సంబురాలను నిర్వహించిన ఘటన కేసీఆర్‌ది అని కొనియాడారు.

Leave a Reply