ఎన్నికలు బీహార్ లో… ప్రచారం పల్నాడులో…!!
- లోక్ జనశక్తి ఏపీ నేత జొన్నలగడ్డ వినూత్న ప్రచారం
పల్నాడు ప్రతినిధి (ఆంధ్రప్రభ) : నవంబర్ 6, 11వ తేదీలలో రెండు విడతలుగా జరుగునున్న బీహార్ ఎన్నికల్లో తమ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలంటూ…లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ ) పల్నాడు జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
“ఎన్నికలు బీహార్ లో…ఎన్నికల ప్రచారం మాత్రం పల్నాడులో….” ఏంటండీ ఈ (వి)చిత్రం అనుకుంటున్నారా…! ఇది వాస్తవం. వినూత్న ప్రచారానికి జొన్నలగడ్డ శ్రీకారం చుట్టారు. యువ బీహార్ నిర్మాణనికి అఖండ మెజార్టీతో ఎల్జేపీ ని గెలిపించండి… అని పల్నాడులోని పలు ప్రాంతాలలో పనిచేస్తున్న బీహారీలను మంగళవారం ఆయన కలిసి మాట్లాడారు.
“అబ్ కీ బార్ యువ బీహార్” అనే నినాదంతో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ ) జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, తమ పార్టీ ని ఆదరి oచి అఖండ మెజార్టీతో గెలిపించాలని జొన్నలగడ్డ విజయ్ కుమార్ కోరారు.
పార్టీ తరుపున మొత్తం 29 మంది పోటీ చేస్తున్నామని, మొదటి విడత నవంబర్ 6, రెండో విడత 11 జరిగే పోలింగ్ తేదీలో ఓటర్లు “హెలికాప్టర్ గుర్తు కు ఓటు” వేసి అఖండ మెజార్టీ తో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు.
లోక్ సభ ఎన్నికల సమయంలో ఐదు ఎంపీ స్థానాలకు పోటీ చేస్తే “ఐదుగురు ” గెలిచారని, అదేవిధంగా ఇప్పుడు 29 మంది శాసనసభకు పోటీ చేస్తున్నారని 29 మందిని గెలిపించాలని ఆయన కోరారు. రామ్ విలాస్ పాశ్వన్ కుమారుడు యువ నాయకుడు “చిరాగ్ పాశ్వన్” వలనే బీహార్ అభివృద్ధి వైపు పయనిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం ఒక్కొక్క ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓటు వేయాలని కోరారు. జొన్నలగడ్డ విజయ్ కుమార్ చేస్తున్న ఈ ప్రచారానికి బీహారీలు ఆశ్చర్యానికి గురయ్యారు.