ఆంధ్రప్రభ, పొలిటికల్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో బతుకమ్మ, దసరా (Dussehra) సందడి పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయో? లేవో? అని ఒకవైపు అంటూ.. మరో వైపు అన్ని రాజకీయ పార్టీలు (political parties) తమ తమ పార్టీ శ్రేణులను స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేస్తున్నాయి. దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. కాకపోతే ఎన్నికల వేడి ఇంకా రాజుకోలేదు. ఇప్పటికే ఆశావహులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రసన్నం చేసుకుంటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ (Hyderabad), మల్కాజ్‌గిరి-మేడ్చల్ (Malkajgiri-Medchal) రెండు జిల్లాలు తప్ప మిగిలిన 31 జిల్లాల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అక్టోబర్ 23న తొలివిడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలివిడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 9 నుంచి ప్రారంభమై 11న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ.
కోర్టు నిర్ణయాలకు ఎదురుచూపు!
స్థానిక సంస్థల ఎన్నికలు తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ఈ నెల తొమ్మిదో తేదీ ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టులో ఒక కేసు రేపు విచారణ చేపట్టనుంది. అలాగే హైకోర్టులో ఉన్న కేసు ఈ నెల ఎనిమిదో తేదీన తీర్పు రానుంది. ఈ రెండు కేసులపై ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉందని పలువురు ఎదురు చూస్తున్నారు. దీనిపై న్యాయ స్థానాలు ఎలా స్పందిస్తాయి..? ఏం తీర్పునిస్తాయనేది ఉత్కంఠగా మారింది. కోర్టు నుంచి అనుమతి రాకపోతే తర్వాత పరిణామం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులతో సమాలోచన చేస్తున్నారని తెలిసింది. కోర్టును సానుకూలత లేకపోతే న్యాయపరంగా ఎలా పోరాటం చేయాలి..? కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది..? వాటిని ఎలా అధిగమించాలి..? ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఎలాంటి వాదనలు వినిపించాలి..? అనే విషయాలను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పులు ఎలా వస్తే.. మనం ఎలా స్పందించాలన్నది మిగిలిన రెండు పార్టీలు ఎదురు చూస్తున్నాయి.
ఆ మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకమే…
కోర్టు తీర్పు ఎలా వస్తుందో అనేది పక్కన పెడితే… ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికలు అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌కు ప్రతిష్టాత్మకమే. సాధారణంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు అనుకూలంగా ఉంటాయని భావిస్తుంటారు. అయితే ముఖాముఖీ పోటీలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వాదనలు వర్తిస్తాయి. కానీ తెలంగాణలో పరిస్థితులు వేరు. ఇక్కడ మూడు పార్టీలో పోటాపోటీగా ప్రజల్లోకి వెళుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలకు దీటుగా బీఆర్ఎస్ కూడా ముందుకు వెళ్తుంది. క్షేత్రస్థాయిలో ఎవరి బలం ఎంత అనేది స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలుస్తుంది. క్షేత్ర స్థాయిలో ఉన్న బలాల కోసం ఈ ఎన్నికలను మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
గ్రామాల్లో కోలాహలం
పాలకవర్గాల గడువు ముగిసి 18 నెలలు అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ప్రభుత్వం సిద్ధపడింది. బీసీ రిజర్వేషన్లు నెపంతో ఎన్నికలు జాప్యం చేసినప్పటికీ కోర్టు ఇచ్చిన గడువులో ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం తలొగ్గింది. మరోవైపు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి నిధులు రాని పరిస్థితి కూడా ఉంది. ఈ రెండు కారణాలతో ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికలు అంటే గ్రామాల్లో హడావిడి ఎక్కువగా ఉంటుంది. రచ్చబండ రాజకీయాలు కూడా అధికంగా ఉంటాయి. కొన్ని పంచాయతీలు ఏకగ్రీవంగా చేసుకోవడానికి రాజీలు కుదుర్చుకుంటారు. కోర్టు తీర్పులు పక్కన పెడితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిననాటి నుంచే గ్రామాల్లో కోలహలం ప్రారంభమైంది. కాకపోలే బతుకమ్మ పండుగ, దసరా ఉండడంతో ప్రజలంతా వాటిపై దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆ రెండు పండగలు అయిపోయాయి. అందుకే గ్రామాల్లో ఎన్నికల కోలహలం కనిపిస్తోంది.
అంతర్గత జాబితాలు తయారీలో పార్టీలు
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు పార్టీపరంగా జరుగుతాయి. అయితే పార్టీ అధిష్ఠానం బీఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పోటీ చేసేవారు ఆ జిల్లాలో జడ్పీటీసీగా పోటీ చేయాలి. అందుకు జడ్పటీసీకి పోటీ చేసే అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వాల్సి ఉంది. అయితే అభ్యర్థుల జాబితా అన్ని పార్టీలు అంతర్గతంగా తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్న సీపీఐ మాత్రం ఒకటి రెండు జిల్లా పరిషత్ స్థానాలు అడిగే అవకాశం ఉంది. ఇదీ కూడా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారుతుంది.