ED | తమిళ స్టార్ దర్శకుడు శంకర్ కు ఈడీ షాక్..
చెన్నై – ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ కు ఈడీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ చట్టం ప్రకారం రూ. 10 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. ‘రోబో’ సినిమాను శంకర్ తన కథ ‘జిగుబా’ను కాపీ కొట్టి తెరకెక్కించారంటూ ఆరూర్ తమిళనాథన్ 2011లో పిటిషన్ దాఖలు చేశారు. శంకర్ కాపీరైట్, ఐటీపీ చట్టాలను ఉల్లంఘించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ విషయంపై దర్యాప్తు చేసి, శంకర్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చింది. ‘జిగుబా’ కథకు, ‘రోబో’ సినిమాకు మధ్య గణనీయమైన పోలికలున్నాయని పేర్కొంది. ఈ ఆధారాలతో, కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 ప్రకారం శంకర్‌పై కేసు నమోదైంది.
ఈడీ
ఈ కేసు ఆధారంగా శంకర్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది. శంకర్, ఈ కేసు పరిష్కారం కోసం వివిధ మార్గాల్లో పెద్ద మొత్తంలో నిధులను మళ్లించారని, అవి మనీలాండరింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఈడీ ఆరోపించింది. దర్యాప్తులో భాగంగా ఆయనకు చెందిన మూడు స్థిరాస్తులను ఫిబ్రవరి 17న అటాచ్ చేసినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.
శంకర్ రెమ్యూనరేషన్
2010లో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘రోబో’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టింది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి శంకర్ దాదాపు రూ. 15 కోట్ల పారితోషికంగా అందుకున్నారు. ఇన్వెస్టిగేషన్ లో బయట పడిన విషయాల ఆధారంగా 10 కోట్ల 11 లక్షలు విలువ కలిగిన శంకర్ మూడు స్థిరాస్తులను ఈడి తాజాగా అటాచ్ చేసింది. తదుపరి చర్యలు ఇంకా వెల్లడించలేదు. ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో, ఐ వంటి భారీ విజువల్ వండర్స్‌ను చిత్ర పరిశ్రమకు అందజేశారు శంకర్. టెక్నాలజీని అద్భుతంగా వాడగల దర్శకుల్లో శంకర్ ఒకరు. 90వ దశకంలో అందుబాటులో ఉన్న సాంకేతికతతో ఆయన అద్భుతాలు సృష్టించారు. జీన్స్ చిత్రంలోని ఒక పాటను ప్రపంచంలోని ఏడు వింతల వద్ద షూట్ చేసారు .