మయన్మార్ లో సంభవించిన భూకంప తీవ్రతతో భారత్‌లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్‌కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నా, మేఘాలయలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో విద్యార్థులు, అధ్యాపకులు క్లాస్ రూమ్‌లోంచి బయటకు వచ్చేశారు. అలాగే అధికారులు కూడా కార్యాలయాల్లోంచి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే బంగ్లాదేశ్,చైనాలలోనూ కూడా భూమి కంపించినట్లు ఆ దేశాల మీడియా వెల్లడించింది.
కాగా, మయన్మార్, బ్యాంకాక్‌లో నేటి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. నిమిషాల వ్యవధిలోనే రెండు భూకంపాలు సంబవించాయి.. రెండో భూకంప తీవ్రత 6.4 గా నమోదైంది. ఈ భూకంపాల దాటికి పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కూలిపోయాయి. భారీ ఎత్తున దుమ్ము ఎగిసిపడింది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. పలు కార్యాలయాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. భీకర ప్రకంపనలకు ప్రజలు గజగజ వణికిపోయారు. భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ సహా అనేక ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. థాయిలాండ్‌లో భూప్రకంపనలకు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కూడా ఊగిపోయాయి. స్విమ్మింగ్ పూల్ నీళ్లు కదిలిపోయాయి. పలు బిల్డింగ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇక పర్యాటన నగరమైన చియాంగ్ మాయిలో టూరిస్టులు బెంబేలెత్తిపోయారు. భయంతో ఉరుకులు, పరుగులు తీశారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఇక ఈ భూకంపంలో ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ ఉదయం భారీ భూకంపం సంభవించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. అలాగే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు..