e-Challan | ఒక్క క్లిక్ తో రూ.6 లక్షలు మాయం..

e-Challan | ఒక్క క్లిక్ తో రూ.6 లక్షలు మాయం..
ఆంధ్రప్రభ : ప్రస్తుత జనరేషన్ లో టెక్నాలజీ అనేది మన జీవితంలో విడదీయలేని భాగమైంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు ప్రతి పనికీ స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే, టెక్నాలజీ ఎంతగా పురోగమిస్తోందో, దానిని ఆసరాగా చేసుకుని సామాన్యులను దోచుకునే సైబర్ నేరగాళ్ల ఆగడాలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి.
మాయ మాటలతో నమ్మించడం ఒక ఎత్తైతే.. ఏకంగా ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లను పోలిన నకిలీ వెబ్ సైట్లను సృష్టించి కోట్లాది రూపాయలను కొల్లగొట్టడం సైబర్ ముఠాల నైజంగా మారింది. సామాన్యుల అమాయకత్వాన్ని పెట్టుబడిగా చేసుకుని, ప్రభుత్వ లోగోలు వాడుకుంటూ సైబర్ కేటుగాళ్లు చేస్తున్న మోసాలు విస్తుగొలుపుతున్నాయి.
దీనికి తాజా ఉదాహరణే ‘నకిలీ ఈ-చలాన్’ (Fake e-Challan) మోసం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు వచ్చే చలాన్లను చెల్లించే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే, జీవితకాల కష్టార్జితం క్షణాల్లో ఆవిరైపోయే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నారు సీపీ సజ్జనార్.
ఇటీవల జరిగిన ఘటనలో, ఒక పౌరుడు తన మొబైల్‌కు వచ్చిన నకిలీ ఈ-చలాన్ లింక్‌ను క్లిక్ చేసి దాదాపు రూ.6 లక్షల రూపాయలను పోగొట్టుకున్నారని సజ్జనార్ తెలిపారు. ఆ బాధితుడికి వచ్చిన ఎస్ఎంఎస్ (SMS) లోని లింక్ చూడటానికి అచ్చం పోలీసుల అధికారిక పోర్టల్‌ను పోలి ఉండటంతో.. కేవలం రూ.500 జరిమానా చెల్లించడానికి ఆయన ఆ వెబ్‌సైట్‌లో తన క్రెడిట్ కార్డ్ వివరాలను నమోదు చేశారు. కానీ, కొద్ది నిమిషాల్లోనే సైబర్ కేటుగాళ్లు అనధికారిక అంతర్జాతీయ లావాదేవీల ద్వారా ఆయన కార్డు నుండి ఏకంగా €6,900 (సుమారు రూ.6 లక్షల రూపాయలు) డ్రా చేశారు. చిన్నపాటి జరిమానా అనుకుని చేసిన ప్రయత్నం, భారీ ఆర్థిక నష్టానికి దారితీసింది.
ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఎలాంటి లింకులను క్లిక్ చేసి జరిమానాలు చెల్లించవద్దని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు జరిమానాల గురించి సమాచారం పంపుతారు కానీ, పేమెంట్ చేయమని ఒత్తిడి చేసే లింకులను పంపరు అని వెల్లడించారు.
ఒకవేళ చలాన్ మెసేజ్ వస్తే, నేరుగా అధికారిక వెబ్‌సైట్ echallan.parivahan.gov.in లేదా రాష్ట్ర ట్రాఫిక్ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సందర్శించాలి అని సజ్జనార్ సూచించారు. వెబ్‌సైట్ అడ్రస్‌లో ‘gov.in’ ఉందో లేదో సరిచూసుకోవడం చాలా ముఖ్యం అని స్పష్టం చేశారు. గుర్తుతెలియని వ్యక్తుల నుండి వచ్చే లింక్‌లను క్లిక్ చేయడం అంటే, మీ ఇంటి తాళాలను దొంగల చేతికి ఇచ్చినట్లే అని గ్రహించాలి.
ముఖ్యంగా అంతర్జాతీయ లావాదేవీలు ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డుల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. ఒకవేళ దురదృష్టవశాత్తూ సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు డయల్ చేయాలి లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. మోసం జరిగిన మొదటి రెండు గంటలు (Golden Hour) అత్యంత కీలకం అని, ఈ సమయంలో ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బును రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. సాంకేతికతను వాడుకుందాం, కానీ సైబర్ జాగ్రత్తలను ఇగ్నోర్ చేయవద్దు అని సీపీ సజ్జనార్ సూచించారు.
ఇది కూడా చదవండి : Khammam | ప్రాణం తీసిన పెన్సిల్…
