పాఠశాలల్లో ఆరోగ్య ప్రమాణాల తనిఖీ…

పాఠశాలల్లో ఆరోగ్య ప్రమాణాల తనిఖీ…
విద్యార్థుల పరిశుభ్రతపై డీఎంహెచ్ఓ దృష్టి
వెలగలేరు పీహెచ్సీ పరిధిలో పాఠశాల పరిశీలన
త్రాగునీరు, పోషకాహారం, ఆరోగ్య సేవలపై సమీక్ష
ఐరన్, ఫోలిక్ యాసిడ్ వినియోగంపై అవగాహన పరీక్ష
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలోని పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. సుహాసిని ఆరోగ్య, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం వెలగలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నున్న గ్రామంలోని ఎంపీ యూపీ పాఠశాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. సుహాసిని బుధవారం సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న ఆరోగ్య, పరిశుభ్రత ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఆమె, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, త్రాగునీటి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న ఆర్ఓ తాగునీటి సౌకర్యాలను స్వయంగా పరిశీలించి, నీటి నాణ్యతను పరీక్షించారు.

మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందిస్తున్న ఆహారం మెనూ ప్రకారం తయారవుతోందా అనే అంశాన్ని తనిఖీ చేశారు. పోషకాహార ప్రమాణాలు పాటిస్తున్నట్లు గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రల వినియోగంపై విద్యార్థులకు ఉన్న అవగాహనను కూడా పరీక్షించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల ఆరోగ్య సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు.

పాఠశాలలో ప్రతి వారం ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు అందిస్తున్న సేవలను సమీక్షించారు. అలాగే ‘ముస్తభ్’ కార్యక్రమం అమలు పరిస్థితిని ధృవీకరించారు. మొత్తం మీద పాఠశాలలో ఆరోగ్య, పోషకాహార ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ, మరింత మెరుగుదలకు అవసరమైన సూచనలు చేశారు.

