ఎలిగేడు, ఆంధ్రప్రభ : శాతవాహన విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగం(Department of Economics) అధిపతిగా, విశ్వవిద్యాలయ అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా విధులు నిర్వహిస్తున్నపెద్దపల్లి జిల్లా ఎలిగేడు వాసి డాక్టర్ కోడూరి శ్రీవాణిని 2025 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా విభాగంలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది.
రేపు (శుక్రవారం) జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక(Art Gallery)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రీవాణి ప్రశంసా పత్రం స్వీకరించనున్నారు. ఉన్నత విద్యా విభాగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి, నిత్యం విశ్వవిద్యాలయ(University) అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఉపకులపతి ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, రిజిస్టార్ ప్రొఫెసర్ జాస్తి రవికుమారికి కృతజ్ఞతలు తెలిపారు.
చదువుల తల్లి శ్రీవాణి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎలిగేడు గ్రామంలో జన్మించిన శ్రీవాణిది నిరుపేద చేనేత కుటుంబం తల్లి బీడీ కార్మికురాలు శ్రీవాణి చదువుకుంటూనే తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ బీడీలు చుట్టుతూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించింది. ఆమె చదువు అంత ప్రభుత్వ విద్యా సంస్థలోనే కొనసాగింది.
ఆమె విద్య ప్రయాణమంతా ర్యాంకులు, బంగారు పతకాలతో సాగింది. ఎలిగేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ప్రథమ శ్రేణిలో(First Class), సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, కరీంనగర్లో ఇంటర్మీడియట్ (హెచ్ సి) కళాశాలలో అన్ని గ్రూపులతో కలిసి మొదటి ర్యాంకు సాధించారు.
కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీ.ఏలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో 9వ ర్యాంకు సాధించారు. ఎం ఏ ఎకనామిక్స్ లో మొదటి ర్యాంకుతో మూడు బంగారు పతకాల(Gold Medal)ను స్వీకరించింది. కాకతీయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో బీఈడీ, ఎంఈడీలో ప్రథమ ర్యాంకు సాధించారు.
ఉన్నత విద్యావంతురాలిగా
ఎంఏ అర్థశాస్త్రం, బీఈడీ, ఏంఈడీ, ఎంఫీల్ అర్థశాస్త్రం, పీహెచ్‌డీ అర్థశాస్త్రం, అర్థశాస్త్రం(Economics)లో నెట్, సెట్, ఎడ్యుకేషన్‌లో నెట్ పూర్తి చేశారు. ఒకే సంవత్సరంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (గెజిటెడ్ హోదా) అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్), అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎకనామిక్స్ తెలంగాణ విశ్వవిద్యాలయం, అసి స్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎకనామిక్స్ శాతవాహన విశ్వవిద్యాలయం మొదలగు ఏకకాలంలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది.
సోషల్ స్టడీస్(Social Studies) స్కూల్ అసిస్టెంట్ గా ప్రభుత్వ బాలికల పాఠశాల మహాదేవపూర్‌లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలుగా కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాచర్ల, గుంటూరు జిల్లాలో, అర్థశాస్త్ర విభాగంలో సహాయాచార్యులుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో కొంతకాలం సమర్థవంతంగా విధులు నిర్వహించారు.
ప్రస్తుతం శాతవాహన విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగం(Department of Economics)లో సీనియర్ సహాయ ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్నారు. విశ్వవిద్యాలయంలో ఒకపక్క విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే పరిశోధనా రంగంలో అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నారు.