- తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు
తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): తీవ్ర తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా ఎస్పీ సుబ్బరాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేలపై ప్రయాణించే కంటైనర్లు, లారీలు, ప్రైవేటు, వాణిజ్య భారీ వాహనాల రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు.
మంగళవారం రాత్రి 7 గంటల నుంచి భారీ వాహనాలను హోల్డింగ్ ప్రాంతాల్లో నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికల మేరకు, తుఫాన్ తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత కోసం ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని, లేదా సురక్షిత ప్రదేశాల్లో వాహనాలు నిలిపివేయాలని సూచించారు.
ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రాకూడదని, ప్రయాణాలను వీలైనంతవరకు వాయిదా వేసుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ ఆంక్షలు ప్రజల భద్రత కోసం మాత్రమేనని, తుఫాన్ తీవ్రత తగ్గిన వెంటనే ఎత్తివేయనున్నట్లు తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112 కు కాల్ చేయవచ్చని, పోలీస్ వాట్సాప్ నంబర్ 8099999977కు సమాచారం పంపవచ్చని ఎస్పీ తెలిపారు. తుఫాన్ సమయంలో తిరుపతి జిల్లా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ ఆదేశాలు….
రాష్ట్రంలోని కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో ప్రమాదం అధికంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ (RTGS) హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 8.30 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులు సహా అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపేయాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సూచనలు అందాయి. అయితే అత్యవసర వైద్య సేవల కోసం ప్రయాణించే వాహనాలకు మాత్రమే మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

