అపోహలు సృష్టిస్తే నమ్మొద్దు : సీఐ సత్యనారాయణ

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమృద్ధిగా ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తులు అపోహలు సృష్టిస్తూ నిల్వలు చేసి కృత్రిమ కొరత ఏర్పరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ సీఐ పొన్నం సత్యనారాయణ నమ్మకూడదని తెలిపారు. భీమ్‌గల్ మండల ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇటీవల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగించడం, నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్ చేయడం వంటి చర్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఎవరైనా అధిక ధరలకు బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహ వినియోగానికి మాత్రమే కేటాయించిన ఎల్పీజీ సిలిండర్లను హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాలు వంటి వాణిజ్య స్థలాల్లో వినియోగించడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఇటువంటి చర్యలు ఎస్సెన్షియల్ కమోడిటీస్ చట్టం, 1955 మరియు ఎల్పీజీ (సరఫరా & పంపిణీ నియంత్రణ)ఆర్డర్, 2000 ప్రకారం శిక్షార్హమైన నేరాలని పేర్కొన్నారు.
అవసరానికి మించిన ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వలు చేయడం నేరమని, అక్రమ రీఫిల్లింగ్, నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన సీఐ స్పష్టం చేశారు.ప్రజలు అపోహలకు లోనుకాకుండా అవసరానికి మించిన నిల్వలు చేయరాదని సూచించారు. ఎవరైనా ఎల్పీజీ అక్రమ వినియోగం లేదా నిల్వలు చేస్తున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల భద్రత, సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ పొన్నం సత్యనారాయణ అన్నారు.
