రక్తదానాలు చేసి, ప్రాణాదాతలుగా నిలువండి

రక్తదానాలు చేసి, ప్రాణాదాతలుగా నిలువండి

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : రక్త దానం చేయడం ద్వారా మరో ముగ్గురు వ్యక్తుల ప్రాణాలను కాపాడగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. రక్తదానం మహదానమని అభివర్ణించారు. రక్తదానాలు చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణ‌ధానాలు చేసిన మహా మనుషులుగా మిగిలిపోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని కాజీపేట డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ రోజు మడికొండలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్(Sunpreet Singh) ప్రారంభించారు. ఈ శిబిరంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువత, వ్యాపారస్తులు స్వచ్చందంగా రక్తదానం చేశారు. రక్తదాతలందరికి పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు(Certificates), పండ్లను అందజేశారు.

అనంతరం పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరులను స్మరిస్తూ రక్త దానం చేసేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన ప్రజలకు అభినందనలు తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణ త్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులను స్మరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. పోలీసులు ప్రజల ప్రాణ రక్షణ కోసమే పని చేస్తున్నారని స్పష్టం చేశారు. శాంతిభద్రతలను కాపాడుతూనే ప్రజా సంక్షేమం, శ్రేయస్సు కోసం పాటుపడతారని గుర్తించాలన్నారు.

పోలీసులు ప్రజా సేవకులేనని గుర్తించి కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారని వరంగల్(Warangal) పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి, మడికొండ ఇన్స్ పెక్టర్ పుల్యాల కిషన్, రాష్ట్ర రెడ్ క్రాస్ పాలక సభ్యుడు ఈవి శ్రీనివాస్(EV Srinivas)తో పాటు డాక్టర్లు ఇతర పోలీస్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply