Donald Trump | ఈరోజు ఆంధ్రప్రభ ఎడిటోరియల్..

Donald Trump | ఈరోజు ఆంధ్రప్రభ ఎడిటోరియల్..
Donald Trump | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇరాన్ పై ఐదు రోజుల పాటు యుద్ధానికి విరామం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశంతో చర్చలు జరుగుతున్నట్లు ప్రకటించడం శుభపరిణామమే. అయితే, ఆయన ప్రకటనకు భిన్నంగా ఇరాన్ స్పందించిన నేపథ్యంలో పశ్చిమాసియాలో శాంతి పై ఆశలు ఆవిరవుతున్నాయి. నిజానికి ఇరాన్ పై యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి మాదిరిగా ఉంది. అణ్వస్త్రాలను తయారు చేస్తోందని ఆరోపిస్తూ ఇరాన్ పై దాడులు ప్రారంభించిన ట్రంప్, ఈ యుద్ధం నుంచి బయటపడటం ఎలా అని ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. హర్మోజ్ జలసంధి నుంచి రాకపోకలను పునరుద్ధరించడానికి 48 గంటల సమయమిస్తూ అల్టిమేటమ్ ఇచ్చిన ట్రంప్.. ఇంతలో చర్చల మాట వెల్లడించడం గమనార్హం.

ఇరాన్లో అనేక మంది నేతలతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన ప్రకటించడం విశేషం. ఒక విధంగా చెప్పాలంటే.. నాలుగు వారాలుగా జరుగుతున్న ఈ యుద్ధం వల్ల ఇరాన్ బలం ఏమిటో ఆయనకు తెలిసింది. ఈ యుద్ధంలోకి దిగడం వల్ల అమెరికా ఎన్నడూ లేనంతగా ఆర్థిక సంక్షోభానికి లోనయింది. మిత్రదేశాలు కూడా ట్రంప్ పిలుపును ఖాతరు చేయలేదు. మద్దతు తెలపలేదు. పైగా సొంత పార్టీలో ట్రంప్ నిర్ణయాలపట్ల వ్యతిరేకత ఎదురవుతోంది. అటు అమెరికాలో ట్రంప్నకు జనాదరణ తగ్గుతోంది. మార్కెట్లు కుదేలవుతున్నాయి. ప్రపంచదేశాల పై చమురు భారం పడు తోంది. ఇవన్నీ ట్రంపు పునరాలోచనకు కారణమని భావించవచ్చు.
హార్మూజ్ జలసంధిని కాపాడుకోడానికి వేరేమార్గం లేక అక్కడి నుంచి ఖాళీ చేయాలను ఇరానికి ఐదురోజుల గడువు ఇచ్చారు. ఇందుకోసం యుద్ధానికి విరామం ప్రకటించారు. అంతే తప్ప యుద్ధానికి ముగింపు పలకలేదు. ఇది వ్యూహాత్మకమూ కావొచ్చు. ఈ యుద్ధం ఎంతకాలం కొన సాగితే ట్రంప్కి అంతకాలం కష్టాలు తప్పవని సిఐఏ మాజీ అధిపతి లియోన్ పనేట్టా అభిప్రాయపడ్డారు. ఇరాన్ సుప్రీం నాయకుని పదవిని చేప ట్టిన మొత్తాబా తండ్రి ఖమేనీకన్నా కఠినమైన వైఖరిని అనుసరిస్తున్నారు. హర్మోజ్పై పట్టుకోసం అమెరికా ప్రయత్నిస్తే… పర్షియన్ గల్ఫ్ అంతా సీమైన్స్ అమరుస్తామని ఇరాన్ హెచ్చరించడంతో.. ఇది మరింత ప్రమాద కరమని తెలిసి ట్రంప్ వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు.
యుద్ధం కొనసాగిపునకు పరిస్థితులు అనుకూలంగా లేవని ఆయన గ్రహించారు. కొంత కాలం పాటు విరామం ప్రకటించడమే మంచిదన్న నిర్ణయానికి ఆయన వచ్చారు. ఇరాన్ తో జరుగుతున్న చర్చలు సానుకూల దశకు చేరుకున్న దృష్ట్యా ఐదు రోజుల విరామం ప్రకటిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించగా, ట్రంప్ చర్చల్లో తమ ప్రతినిధులు ఎవరూ పాల్గొనలేదని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ పై తమ లక్ష్యాలు 80 శాతాన్ని సాధించామని ట్రంప్ ప్రకటిచగా, అదంతా నిజం కాదని ఇరాన్ ఖండించింది. ఇరాన్ పై తమదే పై చేయి అని చెప్పుకోవడానికి ట్రంప్ నానా తంటాలు పడుతున్నారు.
