చిత్తూరులో ఏసీబీ సిబ్బందిపై దాడి..

చిత్తూరులో ఏసీబీ సిబ్బందిపై దాడి..

ఇద్దరిపై కేసు నమోదు

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు గిరింపేట లోని జిల్లా రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు జరిగిన నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న ఏసీబీ సిబ్బందిపై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు టూ టౌన్ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ కేసులో మొత్తం ఇద్దరు నిందితులు ఉన్నారు. ఏసీబీ కానిస్టేబుల్ పైన దాడి చేసిన సనంగి రామకృష్ణ, అతని సోదరుడు సనంగి సతీష్ పై కేసును నమోదు చేశారు.

మార్చి 23వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో చిత్తూరు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలోని ఎస్‌ఆర్‌కే అసోసియేట్స్ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న ఏసీబీ సిబ్బంది ఒక అనుమానితుడిని గమనించారు. అతను అక్కడి నుండి పారిపోవడంతో, ఏసీబీ కానిస్టేబుళ్లు ధనుంజయ్, లీల ప్రసాద్ అతన్ని వెంబడిస్తూ ఎస్‌ఆర్‌కే అసోసియేట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ డాక్యుమెంట్ రైటర్ ఎవరని ప్రశ్నించగా, సనంగి రామకృష్ణ తానేనని చెప్పి కానిస్టేబుళ్లతో వాగ్వాదానికి దిగాడు. వెంటనే ఆగ్రహంతో కానిస్టేబుల్ షర్ట్ కాలర్ పట్టుకుని లోపలికి లాగి బయటకు తోసి, భుజాలు, తలపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సమయంలో అక్కడికి వచ్చిన సనంగి సతీష్ కూడా కానిస్టేబుల్‌పై దాడి చేసి, మెడ పట్టుకుని నేలకేసి తోసినట్లు సమాచారం. అంతేకాకుండా ఇనుప రాడ్‌తో దాడి చేయడానికి ప్రయత్నిస్తూ చంపేస్తానని బెదిరించినట్లు వెల్లడైంది. అయితే కానిస్టేబుల్ ప్రతిఘటించి తప్పించుకున్నాడు. తర్వాత అక్కడికి చేరుకున్న మరో కానిస్టేబుల్ లీల ప్రసాద్ తన ఐడీ కార్డు చూపించినప్పటికీ, నిందితుడు దానిని లాక్కొని వంచి పడేసినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడి నుండి వెళ్లేందుకు ప్రయత్నించగా, నిందితులు వారిని అడ్డుకుని మళ్లీ దాడి చేసి, బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఏసీబీ ఇన్స్పెక్టర్ ఎస్‌.వి. నరసింహరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడి చేయడం తీవ్రమైన నేరమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Leave a Reply