కిడ్నీ రాకెట్ ఎలా బయటపడిందో తెలుసా..?

కిడ్నీ రాకెట్ ఎలా బయటపడిందో తెలుసా..?
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గుట్టుగా సాగుతున్న కిడ్నీ రాకెట్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని గ్లోబల్ హాస్పటల్ లో చట్ట విరుద్దంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేస్తుండగా, వైజాగ్ కు చెందిన యమున (28) అనే మహిళ మృతి చెందడంతో ఈ దారుణం బయటపడింది. యమునకు గ్లోబల్ హాస్పటల్ లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసేందుకు ప్రయత్నించారు. ఆపరేషన్ ఫెయిల్ అవ్వడంతో యమున చనిపోయింది. ఈ ఘటన పై మృతురాలి భర్త సూరిబాబుకు, కిడ్నీ మార్పిడికి ప్రొత్సహించిన బ్రోకర్లు సత్య, పద్మలకు తిరుపతిలో వాగ్వాదం జరిగింది.
దీంతో సూరిబాబు 112కు కాల్ చేయగా తిరుపతి ఈస్ట్ పోలీసులు సూరిబాబును విచారించారు. విచారణలో కిడ్నీ మార్పిడి వ్యవహారం మొత్తం మదనపల్లి రెండో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగి ఉండడంతో మదనపల్లి పోలీస్ స్టేషన్ కు పంపించారు. దీంతో కిడ్నీ రాకెట్ దందా బయటపడింది. వెంటనే అప్రమత్తమైన మదనపల్లి పోలీసులు గ్లోబల్ హాస్పటల్ కు వెళ్లి విచారణ చేపట్టారు. వైజాగ్ కు చెందిన పద్మ, సత్య, బాలరంగడులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.
ఈ కిడ్నీ రాకెట్ తో సంబంధం ఉన్న వాళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హాస్పటల్ లో అక్రమంగా ఎన్ని కిడ్నీ ఆపరేషన్ లు జరిగాయి..? ఈ రాకెట్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు…? దేశ వ్యాప్తంగా దీనికి ఏమైనా లింకులు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుని వారి అవయవాలను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టు త్వరలోనే రట్టు అయ్యే అవకాశం ఉంది.
