జిల్లాలో గ్యాస్ నిల్వలు ఉన్నాయి….

జిల్లాలో గ్యాస్ నిల్వలు ఉన్నాయి….

వినియోగదారులు సంయమనం పాటించాలి…
ఓటిపి మరొకరితో పంచుకోకండి..
కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. 08514-293903 కి ఫిర్యాదు చేయండి…
జిల్లా జాయింట్ జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా లో ప్రజల అవసరాలకు సరిపడా వంట గ్యాస్ నిల్వలు ఉన్నాయి అని, జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని, జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తులకార్తిక్ ఆదివారం తెలిపారు.ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ల వద్ద తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నందున గ్యాస్ వినియోగదారులు ఆందోళనకు గురికావలసిన అవసరం లేదన్నారు. వచ్చే రోజుల్లో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే అపోహతో గ్యాస్ వినియోగదారులు అధికంగా అదనపు బుకింగ్స్ చేయడం వలన సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు.

గ్యాస్ వినియోగదారులు సంయమనం పాటించితే గ్యాస్ బుకింగ్ చేసుకున్న డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులందరికీ వారి ఇంటి వద్దనే సక్రమంగా డోర్ డెలివరి చేయడం జరుగుతోందన్నారు. గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెంది గ్రామాలలో గ్యాస్ సిలిండర్ ఆటో ల వద్ద గుంపులు గుంపులు గా చేరవద్దని, సహకరించాలన్నారు. గ్యాస్ సరపరా కోసం అన్ని చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ ఏజెన్సీ వారు వంట గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టరు కె. కార్తీక్ హెచ్చరించారు.

జిల్లాలో గృహ అవసరాలకు గ్యాస్ కొరత లేదన్నారు. ఇండెంట్ ప్రకారం ఆయిల్ కంపెనీలు గ్యాస్ సరఫరా చేస్తున్నాయన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్ కు తరలించినా తగిన చర్య తీసుకుంటామన్నారు. ఆస్పత్రులు పాటశాలలు. హాస్టల్లు , అంగన్వాడీ కేంద్రాలకు ఆటంకం లేకుండా గ్యాస్ ఇవ్వడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్యాస్ ఏజెన్సీలకు ఆదేశాలు జారి చేశారు.
గ్యాస్ నిల్వలు, వాటి ధరను ప్రతి ఏజెన్సీ తప్పనిసరిగా వినియోగదారులకు బహిరంగంగా ప్రదర్శించాలన్నారు.

ఒక సిలిండర్ బుక్ చేసుకున్నాక మరొక సిలిండర్ బుక్ చేసుకోవడానికి పట్టణాలలో 25 రోజులు వ్యవధిగాను, గ్రామాలలో 45 రోజులు సమయం పడుతుందన్నారు. గ్యాస్ వినియోగదారులు తమకు కేటాయించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను హోటల్స్, టిఫిన్ సెంటర్లు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు విక్రయించినట్లు తెలిసిన యెడల, వారి సబ్సిడి నిలిపివేయడం మరియు గ్యాస్ కనెక్షన్ రద్దు చేయుటకు తగిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.కొందరు అపోహలు సృష్టించి బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ను ఎక్కువ ధరకు విక్రయాలు చేస్తున్నట్లయితే అటువంటి వారిపై కటినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

బ్లాక్ మార్కెట్ వ్యవస్థను నివారించడానికి సిలిండర్ ను బుక్ చేసుకొనేటప్పుడు ఓటీపీ నెంబరు పద్దతిని ప్రవేశపెట్టడం జరిగినదన్నారు. ఈ ఓటీపీ నెంబరును సంబందం లేని బయటి వ్యక్తులతో పంచుకోవద్దన్నారు. గ్యాస్ సమస్యల పై కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ నంబర్ 08514-293903 కు ఫిర్యాదు చేయవలెను. ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించకుండా జాగ్రత్తలు తీసుకోవలెను. దీనికి విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే సంబందిత డిస్ట్రిబ్యూటర్లపై చర్యలు తీసుకొని, వారి లైసెన్సులను రద్దు చేయుటకు కూడా చర్యలు తీసుకోబడును.

గ్యాస్ వినియోగదారులు డెలివరీ సమయంలో గ్యాస్ డెలివరీ బాయ్స్ కు బిల్లు మొత్తానికి అదనంగా ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ఎవరైనా డెలివరి బాయ్స్ వినియోగదారులతో అమర్యాదగా ప్రవర్తించినా లేదా బిల్లులో పేర్కొన్న మొత్తానికి మించి డబ్బులు డిమాండ్ చేసినా వెంటనే సంబందిత పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దారు, సంబంధిత మండల తహశీల్దారు, జిల్లా పౌరసరఫరాల అధికారి లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1967, కమాండ్ కంట్రోల్ నంబర్ 08514-293903 కు ఫిర్యాదు చేయవలసిందిగా గ్యాస్ వినియోగదారులను కోరారు.

Leave a Reply